మావోయిస్టు అగ్రనేత ఆర్కే ను పోలీసులు చుట్టుముట్టారా.. ఆయన పోలీసుల చక్రబంధంలో ఇరుక్కుపోయారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆయన ఒక్కరే కాదు.. ఆయనతో పాటు మరికొందరు మావోయిస్టు అగ్రనేతలు కూడా పోలీసుల వలయంలో ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు రామకృష్ణ.. ఆర్కే ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పరిసరాల్లో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

 

 

ఇప్పటికే ఒడిశా పోలీస్‌ యంత్రాంగం కూంబింగ్‌ ద్వారా ఆయన్ను చుట్టుముట్టినట్టు వార్తలు వస్తున్నాయి. మరో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు ఉదయ్, చలపతి కూడా ఏవోబీలోనే ఉండిపోయారట. ఈ వార్తలే నిజమైతే.. ఈ ఆపరేషన్ అటు పోలీసులకు, ఇటు మావోయిస్టులకూ ఛాలెంజింగ్ టాస్క్ గానే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒడిశా పోలీసులు వీరి కోసం ఆపరేషన్‌ ఆర్కే పేరుతో గాలింపు మొదలుపెట్టారు.

 

 

అయితే ఆర్కే పోలీసుల చేతులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకోవడం చాలాసార్లు జరిగింది. ఈనెల 15న కూడా ఆర్కే చిత్రకొండ ఏరియాలో కూంబింగ్‌ జరుపుతున్న పోలీసులకు తారసపడ్డారని.. ఎదురు కాల్పులు జరిపినా ఆయన చాకచక్యంగా తప్పించుకున్నారని వార్తలు వచ్చాయి. మళ్లీ కేవలం పది రోజులు తిరగకుండానే ఆర్కే ను మరోసారి పోలీసులు రౌండప్ చేసినట్టు తెలుస్తోంది. అయితే పది రోజుల క్రితం ఆయన్ను చుట్టుముట్టినప్పుడు పోలీసులకు ఓ పెన్ డ్రైవ్ దొరికినట్టు తెలుస్తోంది.

 

 

ఆ పెన్ డ్రైవ్ లో దొరికిన సమాచారం ఆధారంగానే మరోసారి ఆర్కేను రౌండప్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎస్‌వోజీ, డీబీఎఫ్‌, ఆంధ్ర గ్రేహౌండ్స్, తూర్పు గోదావరి జిల్లా పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్‌ ఆర్కేను నిర్వహిస్తున్నారు. ఇక ఆర్కే గురించి చెప్పుకోవాలంటే.. ఆయన దేశంలోనే మావోయిస్టు పార్టీ అగ్రనేతలలో ఒకరు. గతంలో వైఎస్సార్ ప్రభుత్వం హయాంలో నక్సలైట్లతో ప్రభుత్వం చర్చలు జరిపిన సమయంలో మావోయిస్టుల కు ఆర్కేనే నాయకత్వం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: