కొత్తరకం వైరస్ ’కరోనా’ దెబ్బకు చైనా ప్రభుత్వం వణికిపోతోంది. ఇప్పటి వరకు ఈ వ్యాధిసోకి సుమారు 26 మంది చనిపోయారు. మరో తొమ్మిదివందల మందికి కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు.  చైనాలో కొత్త సంవత్సరం వస్తోందన్న ఆనందాన్ని కొత్తరకం వైరస్ తుడిచిపెట్టేసింది. వ్యాధి భారిన పడిన వారికి చికిత్స అందించేందుకు చైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కేవలం ఆరు రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మిస్తోందంటేనే  కరోనా ఎంతగా వణికించేస్తోందో అర్ధమైపోతోంది.

 

వుహాన్ ప్రాంతంలో 3 లక్షల చదరపు అడుగుల విస్తార్ణంలో నాలుగు అంతస్తుల్లో అత్యంత ఆధునిక పద్దతులు అంటే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో  అతిపెద్ద ఆసుపత్రిని నిర్మించబోతోంది. అసలు ఈ కరోనా వ్యాధి సముద్ర ఉత్పత్తుల మార్కెటింగ్, క్రెయిట్ పాములు, గబ్బిలాల నుండి వ్యాపిస్తుందని చైనా శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఎందుకంటే వుహాన్ లో ఓ మార్కెట్లో చట్ట విరుద్ధంగా పాములు, గబ్బిలాలు, ఇతర అడవి జంతువులను అమ్ముతుంటారు.

 

ఇక్కడ కొనుగోలు చేసిన వాటిని ఇళ్ళకు, హోటళ్ళకు తీసుకెళ్ళి వంటకాలు తయారు చేస్తారు. ఈ వంటకాలు ప్రధానంగా సెంట్రల్ హూబి ప్రావిన్స్ లో అమ్ముతుంటారు. ఇక్కడ తిన్న వారిలోనే ముందుగా కరోనా బయటపడింది. కాబట్టి ప్రావిన్స్ లోని 13 నరాల నుండి జనాలను బయటకు రానీయటం లేదు. అలాగే ఇతర ప్రాంతాల నుండి ప్రావిన్స్ లోని 13 నగరాలకు రాకపోకలను ప్రభుత్వం నిషేధించింది.  

 

చైనానే ఈ వైరస్ భయపట్టేస్తోందంటే ఇక మనదేశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే చైనా ప్రభుత్వం తీసుకున్నంత స్ధాయిలో మనదేశంలో ముందు జాగ్రత్తలు తీసుకోరన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ వ్యాధి సోకిందన్న అనుమానంతోనే  ఢిల్లీలోని ఎయిమ్స్  కు ఓ రోగిని తరలించారు. అలాగే చైనా నుండి వచ్చిన ముగ్గురిలో జలుబు, జ్వరం ఉందని గుర్తించగానే విమానాశ్రయం అధికారులు అధికారులకు సమాచారం ఇచ్చారు.

 

వెంటనే వైద్యాధికారులు అప్రమత్తమై వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. దేశంలోని దాదాపు 20 విమానాశ్రయాల్లోకి చైనా నుండి వచ్చే ప్రయాణీకులను పరీక్షించేందుకు స్క్రీనింగ్ చేస్తున్నారు. అలాగే కేరళ నుండి  చైనాకు వెళ్ళి వచ్చి గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్న 80 మందిని అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా చికిత్స చేయిస్తోంది. తీవ్రమైన జ్వరం, దగ్గు, శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల్లో సమస్యలు, కిడ్నీ పనితీరులో తేడాలు లాంటివి వ్యాధి లక్షణాలుగా గుర్తించారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: