తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఏకపక్షంగా విజయాలు సాధిస్తోంది. కారు జోరును హస్తం, కమలం ఏ మాత్రం అడ్డుకోలేకపోయాయి. మరి సీన్ ఇలా ఉంటే.. కారుకు చావు దెబ్బ అంటారేంటి అంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. తెలంగాణ అంతటా కారు జోరు వీస్తోంది. చాలా అరుదుగా అక్కడక్కడా ఆ పార్టీకి చుక్కలు కనిపించాయి. అలాంటి అతి తక్కువ స్థానాల్లో కొల్లాపూర్ నియోజకవర్గం ఒకటి.

 

ఇక్కడ.. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి స్థానిక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో తీవ్ర అసమ్మతి ఎదుర్కొన్నారు. జూపల్లి వర్గీయులు ఏకంగా ఆలిండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీ తరపున 20 వార్డుల్లో పోటీలో నిలిచారు. అంతే కాదు.. వారి తరఫున జూపల్లి ప్రచారం కూడా చేశారు. ఈ మొత్తం పరిణామాలు ఎన్నికల ఫలితాలపై పెద్ద దెబ్బే వేశాయి.అక్కడ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ త‌ర‌పున పోటీ చేసిన రెబ‌ల్స్ ఆధిక్యంలో ఉన్నారు. చివ‌ర‌కు పార్టీ చైర్మన్ అభ్యర్థి ఆనంద్‌కుమార్ ఓట‌మి పాలు కావడం పార్టీకి ఎదురు దెబ్బ గానే చెప్పుకోవాలి.

 

ఇక్కడే కాదు.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లు.. పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచినవాళ్లు.. ఆ తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చిన నేతలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో గడ్డు పరిస్థితే కనిపించింది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది శాసనసభాపక్షంగా ఏర్పడి టీఆర్‌ఎస్ లో విలీనమయ్యారు.

 

కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కేసీఆర్ ఇచ్చిన హామీతో పార్టీలో చేరిపోయారు. కానీ.. ఆ తర్వాత సీన్ మారిపోయింది. హైకమాండ్ దగ్గర సీన్ బాగానే ఉంది కానీ.. గ్రౌండ్ లెవల్లో మాత్రం ఈ విలీనం సంపూర్ణం కాలేదు. అందుకే ఈ కొల్లాపూర్ ఫలితమే ఓ ఉదాహరణగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: