ఎన్నికల ఫలితాలు ఒక్కోసారి షాకిస్తుంటాయి. ఇపుడు వస్తున్న తెలంగాణా మున్సిపల్ ఫలితాలు ఇలాగే ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం 120 మున్సిపల్ ఫలితాలు తాజా పరిస్ధితిని చూస్తే టిఆర్ఎస్ దాదాపు 81 మున్సిపాల్టిల్లో మెజారిటితో మంచి జోరు మీదుంది. అయితే ఇన్ని మున్సిపాలిటిల్లో దూసుకుపోతున్న కారు జోరు యాదాద్రి పుణ్యక్షేత్రంలో మాత్రం బోల్తా పడటమే విచిత్రంగా ఉంది.

 

నిజానికి యాదాద్రి జిల్లాలోని యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయటానికి కేసియార్ వందల కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతున్నారు. పుణ్యక్షేత్రంలో దేవాలయాన్ని అభివృద్ధి చేయటానికి ఇప్పటికే భారీగా ఖర్చు పెట్టారు. దేవాలయం నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కేసియార్ రెగ్యులర్ గా యాదాద్రిని సందర్శిస్తునే ఉన్నారు. అంటే ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు.

 

గడచిన మూడేళ్ళుగా యాదాద్రిని కేసియార్ ఎన్నిసార్లు పర్యటించారో లెక్కేలేదు. ఇలాంటి పుణ్యక్షేత్రమైన యాదాద్రి మున్సిపాలిటిలో నిజానికి టిఆర్ఎస్ కు తిరుగే ఉండకూడదు. కానీ విచిత్రంగా కాంగ్రెస్ మంచి మెజారిటి సాధించింది.  కారణాలేమిటంటే ఈ మున్సిపాలిటి పరిధిలో సీనియర్ కాంగ్రెస్ నేతలు కోమటరెడ్డి బ్రదర్స్ ప్రభావం ఎక్కువం. వీళ్ళు పోటి చేసిన ఏ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా క్యాడర్ ను మాత్రం అట్టే పెట్టుకుంటారు. అలాగే రెగ్యులర్ గా  మామూలు జనాలతో టచ్ లో నే ఉంటారు. అంటే క్షేత్రస్ధాయిలో సోదరులిద్దరికీ బాగా  పట్టుంది. దానివల్లే యాదాద్రిపై కేసియార్ ఎంత వ్యక్తిగత శ్రద్ధ చూపించినా కాంగ్రెస్ గెలిచింది.

 

యాదాద్రి మున్సిపాలిటిలో మొత్తం 12 వార్డులున్నాయి. ఇందులో కాంగ్రెస్ ఐదు వార్డుల్లోను టిఆర్ఎస్ మూడు వార్డుల్లోను గెలిచింది. సిపిఐ ఒక వార్డులో గెలిస్తే స్వతంత్ర అభ్యర్ధులు  మూడు వార్డుల్లో గెలిచారు.  సిపిఐ. ఇండిపెండెట్ అభ్యర్ధుల మద్దతు  పలకటంతో ఛైర్మన్ స్ధానం  కాంగ్రెస్ దే అనటంలో సందేహం లేదు. మొత్తానికి యాదాద్రి మున్సిపాలిటి కేసియార్ కు భలే షాకిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: