కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలకు వ్యవసాయ రంగానికి కేవలం ఆరు గంటల నుండి 8 గంటల కరెంట్ మాత్రమే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. భూగర్భ జలాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలో పలు రాష్ట్రాల్లో వ్యవసాయ రంగానికి తొమ్మిది గంటల లోపు విద్యుత్ ను వ్యవసాయ రంగానికి అందిస్తుండగా తెలంగాణలో మాత్రం 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా అవుతోంది. 
 
కేంద్రం భూగర్భ జలాలను పరిరక్షించాలనే ఆశయంతో ఎనిమిది గంటలకు మించి వ్యవసాయ రంగానికి కరెంట్ ఇవ్వరాదని దేశంలోని అన్ని రాష్ట్రాలకు సూచిస్తోంది. కొన్ని రోజుల క్రితం గుజరాత్ రాష్ట్రంలో జరిగిన విద్యుత్ మంత్రుల సదస్సులో కూడా ఇదే విషయం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. గడచిన మూడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలోని పంపుసెట్లకు ప్రభుత్వం 24 గంటల కరెంటును అందిస్తోంది. 
 
24 గంటల కరెంట్ ను అందించడం వలన ప్రతిరోజు దాదాపు 21 మిలియన్ యూనిట్ల విద్యుత్ అదనంగా వినియోగిస్తున్నట్టు తేలింది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 27 లక్షల పంపుసెట్లు ఉండగా అధికారికంగా మాత్రం కేవలం 23 లక్షల పంపుసెట్లు ఉన్నాయి. నాలుగు లక్షల పంపుసెట్లు మాత్రం అనధికారికంగా ఉన్నాయి. ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విద్యుత్ మీటర్లను వ్యవసాయ పంపుసెట్లకు తొలగించడం జరిగింది. 
 
ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు మీటర్లు పెట్టాలెనే ఆలోచన చేసినా ఆ ఆలోచనలు అమలు కాలేదు. కేంద్రం 8 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలని చేసిన సూచనలతో రాష్ట్ర ప్రభుత్వాలు మీటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం 9 గంటల కరెంట్ ఇవ్వలేమని చెప్పటం రైతులకు ఒక రకంగా షాక్ అనే చెప్పవచ్చు. మరోవైపు కేంద్రం వ్యవసాయ పంపుసెట్లను సోలార్ పంపుసెట్లుగా మార్చాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. పీఎం కుసుమ్ పథకం ద్వారా సోలర్ పంపుసెట్లను పంపిణీ చేసి విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: