అసెంబ్లీ ముంద‌స్తు ఎన్నిక‌లు, సార్వ‌త్రిక పోరు, అనంత‌రం వ‌చ్చిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స్ప‌ష్ట‌మైన టీఆర్ఎస్ దూకుడు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోను కొన‌సాగుతోంది. మెజార్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కారు దూసుకుపోతోంది. కొన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పూర్తిస్థాయి వార్డులను కైవసం చేసుకుంది. అత్యధిక వార్డులు కైవసం చేసుకోవడంతో టీఆర్ఎస్ శ్రేణులు, నేతలు సంబరాల్లో పాల్గొన్నారు.  టీఆర్ఎస్‌ గెలుపుతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. కౌంటింగ్ కేంద్రాల  వద్ద పండుగ వాతావరణం నెలకొంది.  జిల్లాలు, మండల కేంద్రాల్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుని అప్పుడే స్వీట్స్ పంచుకుని.. బాణాసంచాలు పేల్చుతున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్‌-బీజేపీ కార్యాల‌యాలు బోసిపోయి క‌నిపిస్తున్నాయి. 

 

మొత్తం 120  మున్సిపాలిటీల్లో ఇప్పటికే పదకొండు  కైవసం చేసుకున్న కారు మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది.  మరిపెడ, వర్ధన్నపేట , పెద్దపల్లి, ధర్మపురి, బొల్లారం , బాన్సువాడ,   కొత్తపల్లి,   భీంగల్ , సత్తుపల్లి, ఆందోల్ , కాగజ్ నగర్ మున్సిపాలిటీలను కారు కైవసం చేసుకుంది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలో 11 చోట్ల టీఆర్‌ఎస్ గెలుపొందింది. వరంగల్ రూరల్ మున్సిపాలిటీ 17వ వార్డులో,  12వ వార్డులో టీఆర్ఎస్ విజయం సాధించింది. సిరిసిల్లలోని నాలుగు వార్డుల్లో టీఆర్ఎస్ గెలుపొందింది. వేములవాడలో ఒక స్థానంలో టీఆర్‌ఎస్ గెలుపొందింది. జవహర్ నగర్ కార్పొరేషన్‌లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. మేడ్చల్ జిల్లా అలగిరి చిత్ర డివిజన్‌లో గెలుపొందింది. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో టీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. సంగారెడ్డి జిల్లా బొల్లారంలోని 16,17,18 వార్డుల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో రెండో వార్డులో, ఖమ్మం జిల్లా సత్తుపల్లి పదో వార్డులో, ఖమ్మం జిల్లా వైర ఏడవ వార్డులో,  హుస్నాబాద్ 13,17 వార్డుల్లో టీఆర్‌ఎస్ గెలుపొందింది. 

 


ఇక తెలంగాణలో బలోపేతం దిశగా అడుగులేస్తున్న కమలదళం.. మున్సిపోల్స్ ఫలితాలపై భారీగానే ఆశలు పెట్టుకున్న‌ప్ప‌టికీ...ఫ‌లితం లేకుండా పోయింది. వార్ వన్ సైడేనన్న‌టీఆర్ఎస్ ధీమా నిజ‌మైంది. మ‌రో ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన  కాంగ్రెస్ గెలుపుపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న‌ప్ప‌టికీ...పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. కాంగ్రెస్‌, బీజేపీ ప్ర‌చారం, మాట‌లు... సోదిలో లేకుండా పోయాయని అంటున్నారు. ఆ రెండు పార్టీల్లో నెత‌లెవ‌రూ ఆక‌ట్టుకునే ప్ర‌చారం చేయ‌లేక‌పోయార‌ని పేర్కొన్నారు. మొత్తంగా టీఆర్ఎస్ గాలి తెలంగాణ‌లో కొన‌సాగుతోంది. నేత‌ల‌తో సంబంధం లేకుండా కారు దూకుడు క‌నిపించింద‌ని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: