తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు మొదలైపోయింది. ఈరోజు ఉదయం మొదలైన ఫలితాల కౌంటింగ్ లో కారుకు బ్రేకులు లేకుండా ఫలితాల్లో దూసుకుపోతోంది. ఆ ఎన్నికలు.. ఈ ఎన్నికలు అనే తేడా లేకుండా టీఆర్ఎస్ తన హవా చూపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనే తన ప్రతాపం చూపిన టీఆర్ఎస్ ఇప్పుడు కూడా తన హవా చాటుతోంది. ఇప్పటికే మూడొంతుల మెజారిటీతో టీఆర్ఎస్ కారు దూసుకుపోతోంది.

 

 

తెలంగాణలోని తొమ్మిది కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఉదయం నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో అధికంగా టీఆరఎస్సే ఆధిక్యంలో ఉంది. తొమ్మిది కార్పొరేషన్లలో కూడా టీఆర్ఎస్ పార్టీనే ఆధిక్యంలో ఉంది. రామగుండం, బడంగ్ పేట, మీర్ పేట, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్, నిజామాబాద్ కార్పొరేషన్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. సూర్యాపేట, మహబూబ్ నగర్ మున్సిపాలిటీల్లోనూ టీఆర్ఎస్ ముందంజలో ఉంది. కార్పొరేషన్లలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్‌, బీజేపీ కనీసం పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేకపోవడం విశేషం. ఇప్పటి వరకు తొమ్మిది మున్సిపాల్టీలు టీఆర్‍ఎస్ కైవసం చేసుకుని దూసుకుపోతోంది. మరిపెడ, వర్ధన్న పేట, డోర్నకల్, పెద్దపల్లి మున్సిపాల్టీల్లో టీఆర్‍ఎస్ ఇప్పటికే గెలిచింది. ధర్మపురి మున్సిపాలిటీలో జరిగిన హోరాహోరీ పోరులో టీఆర్‍ఎస్ విజయం సాధించింది. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాల్టీని కూడా టీఆర్‍ఎస్ కైవసం చేసుకుంది.

 

 

ఇదే జోరుతో టీఆర్ఎస్ కొనసాగితే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ లో నాయకత్వ లేమి, బీజేపీపై ప్రజలకు ఇంకా పూర్తిగా నమ్మకం కుదరకపోవడం వల్లే ఆ పార్టీలను ప్రజలు గెలుపు స్థానాలు ఇవ్వటం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక టీడీపీ సంగతి ప్రజలు పూర్తిగా మర్చిపోయారని ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. మొత్తానికి సమకాలీన తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ తనకు ఎదురులేదని నిరూపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: