తెలంగాణలో జ‌రిగిన  మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్ల‌లో .. టీఆర్ఎస్ పార్టీ హ‌వా స్ప‌ష్ట‌మైంది. అధికారికంగా సంఖ్య‌ల రూపంలో ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌డం పెండింగ్‌లో ఉన్న‌ప్ప‌టికీ.... కారు జోరు కొన‌సాగుతోంద‌ని స్ప‌ష్ట‌మైంది. క‌నీసం వంద మున్సిపాల్టీలు టీఆర్ఎస్ వశం అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే... మున్సిపాల్టీల్లో దాదాపు 80 శాతం వార్డుల‌ను టీఆర్ఎస్ కైవ‌సం చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గులాబీ విర‌గ‌బూయ‌డం....శ్రేణులంతా సంబురాల్లో ఉన్న నేప‌థ్యంలో పార్టీ ర‌థ‌సార‌థి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. 

 

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి.మొత్తం 120 మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ పార్టీ 109 మున్సిపాలిటీల్లో ముందంజలో ఉంది. కొన్ని మున్సిపాలిటీల్లో అయితే టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకపక్ష విజయం సాధించింది. 9 కార్పొరేషన్లకు గానూ 5 కార్పొరేషన్లలో టీఆర్‌ఎస్‌ లీడ్‌లో ఉంది. ఈ నేప‌థ్యంలో, టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సంద‌ర్భంగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల‌పై విరుచుకుప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆ పార్టీ మోడ‌ల్ తెలంగాణ‌లో ప‌నిచేయ‌డం లేద‌ని మ‌రోమారు కేసీఆర్ పున‌రుద్ఘాటించ‌నున్నట్లు స‌మాచారం.

 

జ‌న‌వ‌రి 22న జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇవాళ వాటికి కౌంటింగ్ జ‌రుగుతోంది. అయితే ఫ‌లితాల‌కు ముందే అభ్య‌ర్థులు 81 స్థానాల‌ను ఏక‌గ్రీవంగా కైవ‌సం చేసుకున్నారు.  దాంట్లో టీఆర్ఎస్ వారే 78 మంది ఉన్నారు. ఈ ఏకగ్రీవాల‌తో కారు ఓట్ల శాతం మ‌రింత పుంజుకున్న‌ట్లు చెప్తున్నారు.  అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో టీఆర్ఎస్‌కు 47 శాతం ఓటు షేర్ వ‌చ్చింది. ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల్లో సుమారు 51 శాతం ఓటు షేర్ వ‌చ్చిన‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు వెల్ల‌డిస్తున్నారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా, మిష‌న్ భ‌గీర‌థ లాంటి స్కీమ్‌లు ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీర్చాయి. క‌ళ్యాణ ల‌క్ష్మీ, షాదీముబార‌క్ లాంటి ప‌థ‌కాలు కూడా కొన్ని ప‌ట్ట‌ణ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకున్నాయి.  వివిధ ర‌కాల ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీర్చుతున్న టీఆర్ఎస్ పార్టీకే ప్ర‌జ‌లు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప‌ట్టంక‌ట్టారని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: