ఏసీబీ కోర్టులో నిన్న తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదాయనికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ వేసిన పిటిషన్ పై విచారణ కొనసాగింది. సీనియర్ న్యాయవాది కోకా శ్రీనివాస్ లక్ష్మీ పార్వతి తరపున వాదనలు వినిపించారు. కోర్టుకు తాము చంద్రబాబు అధికారికంగా ప్రకటించిన ఆస్తుల వివరాల ఆధారంగానే ఫిర్యాదు చేసినట్లు కోకా శ్రీనివాస్ తెలిపారు. 
 
చంద్రబాబు ఆదాయం ఒకప్పుడు వేలల్లో ఉండేదని కానీ కొంతకాలానికే చంద్రబాబు కోట్లకు పడగలెత్తారని అది ఎలా సాధ్యమైందో మాత్రం కోర్టుకు చంద్రబాబు చెప్పలేదని కోర్టుకు లాయర్ తెలిపారు. చంద్రబాబు నాయుడు అధికారిక పత్రాల్లో పిల్లనిచ్చిన మామ ఎన్టీయార్ కూడా చంద్రబాబుకు కట్నం ఇవ్వలేదని పేర్కొన్నారని చెప్పారు. అసెంబ్లీకి ఇచ్చిన పత్రాల్లో, ఎన్నికల సమయంలో చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించారని అన్నారు. 
 
చంద్రబాబు ఎమ్మెల్యేగా, మంత్రిగా పొందిన జీతభత్యాలతోనే కోట్ల రూపాయలు సంపాదించినట్టు చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఆదాయం కంటే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని ఆస్తులు ఎలా సంపాదించారో తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. చంద్రబాబు హెరిటేజ్ కంపెనీని ఏర్పాటు చేసిన తరువాత ఐదు నెలలు మాత్రమే 20,000 రూపాయల చొప్పున జీతం తీసుకున్నట్టు చెప్పాడని అన్నారు. 
 
చంద్రబాబు నాయుడు కేవలం 20,000 రూపాయల జీతం తీసుకుంటే కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారని ఈ విషయాలను తేల్చడం కొరకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని లాయర్ కోర్టును కోరారు. ఏసీబీ కోర్టు సాంకేతిక కారణాల వలన ఈ కేసులో స్టే ఉన్నట్టు వెబ్ సైట్ లో ఉందని అందువలన పూర్తి వివరాలు తెలుసుకొని వచ్చే విచారణ సమయంలో చెప్పాలని కోర్టు ఆదేశించింది. 2005 లో లక్ష్మీపార్వతి చంద్రబాబుపై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. ఆ తరువాత చంద్రబాబు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఈ కేసుపై స్టే పొందారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించరాదని కోర్టు తీర్పు ఇవ్వడంతో 2019 నవంబర్ 18వ తేదీన ఈ కేసులో విచారణ ప్రారంభమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: