అధికార పార్టీ టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఎంత పోటీ ఉంటుందో.. సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డికీ అంతే పోటీ ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల నుంచీ ఇప్పటి మున్సిపల్ ఎన్నికల వరకూ ఇలా పార్టీల మధ్య పోటీ ఓ వైరంలా నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డికి భారీ షాక్‌ తగిలింది. ఆయన గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్‌లో కాంగ్రెస్‌కు చేదు ఫలితాలు వచ్చాయి. 

 

 

కొడంగల్‌ మున్సిపాలిటీలో అధికార టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. మొత్తం 12 వార్డుల్లో గులాబీ పార్టీ 7 గెలుపొందగా, కాంగ్రెస్‌ కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి కొడంగల్‌కు ఎక్కువ సమయమే కేటాయించినప్పటికీ ఫలితం లేకపోయింది. టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. కారు జోరు ముందు కాంగ్రెస్ కుదేలయింది అనే చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృత్తం చేస్తూ.. కొడంగల్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

 

 

 ఒక్క కొడంగల్ మునిసిపాలిటీ అనే కాకుండా రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ హవానే నడుస్తోంది. ఇందులో భాగంగానే కొడంగల్ లో కూడా టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. అయితే కొడంగల్ లో ఓటమిని ఎవరూ కాంగ్రెస్ కూటమిగా చూడరు. రేవంత్ రెడ్డి ఓటమిగానే పరిగణిస్తారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డికి మంచి పట్టు ఉండడమే ఇందుకు కారణం. టీఆర్ఎస్ హవా ముందు ఇవేమీ నిలబడలేదు. కేవలం మూడు స్థానాలే కాంగ్రెస్ గెలవడం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కారు స్పీడే కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: