ప‌క్క‌లో బ‌ల్లెంలాగా  మారిన పొరుగుదేశం పాకిస్థాన్ త‌న కుట్ర‌లు కొన‌సాగిస్తోంది. జమ్మూకశ్మీర్‌ విభజన తర్వాత భారత్‌పై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్న పాకిస్థాన్‌.. మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఇరు దేశాల సంబంధాలు క్షీణించిన తరుణంలో క్షిపణి పరీక్ష చేపట్టింది. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి ఘజ్నివీని విజయవంతంగా ప్రయోగించినట్లు పాక్‌ సైన్యం ప్రకటించింది.

 


అణ్వస్త్రాలను ఉపరితలం నుంచి ఉపరితలానికి మోసుకెళ్లే సామర్థ్యం కల బాలిస్టిక్ క్షిపణి ఘజ్నవి. పాక్ వ్యూహాత్మక సైనిక దళ కమాండ్‌కు నిర్వహించిన శిక్షణ లో భాగంగా గురువారం ఈ పరీక్ష జరిపినట్టు ఆ దేశ సైన్యం మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్పీఆర్) తెలిపింది. పాక్ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ జాకీ మాంజ్‌తో పాటు పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల సమక్షంలో ఈ పరీక్ష జరిగిందని పాక్ ప్రభుత్వం రేడియో తెలిపింది. ఈ పరీక్ష పాక్ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని ఆ దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్, త్రిదళాధిపతులు ప్రశంసించారు.పగలైనా, రాత్రైనా ఎలాంటి కార్యచరణకైనా సైన్యం సిద్ధంగా ఉండాలనే లక్ష్యంతో ఈ పరీక్ష జరిపాం అని ఐఎస్పీఆర్ పేర్కొంది. 290 కి.మీ. పరిధిలో లక్ష్యాల్ని చేధించగల సామర్థ్యం ఘజ్నవి సొంతమంది. 

 


కాగా, ఇటీవ‌ల ఏభార‌త్ పాక్ విష‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. పాకిస్థాన్‌తో యుద్ధం ఎప్పుడొస్తుందో అంచనా వేయలేమని రక్షణదళాల అధిపతి(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. అయితే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు రక్షణ బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. తమిళనాడులోని తంజావూరు ఎయిర్‌స్టేషన్‌లో ‘టైగర్‌షార్క్స్‌' 222 స్కాడ్రన్‌ను  వాయుసేన ఏర్పాటు చేసింది. బ్రహ్మోస్‌ క్షిపణులను మోసుకెళ్లగలిగే సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానాలను దక్షిణ భారత్‌లో తొలిసారి మోహరించనున్నారు. ఈ స్కాడ్రన్‌ ప్రారంభోత్సవంలో సీడీఎస్‌  రావత్‌, వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ భదౌరియా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: