నిర్మల్ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీలో ఎంఐఎం పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల ముందు భైంసా మున్సిపాలిటీ తీవ్ర ఘర్షణలతో వార్తల్లో నిలిచింది. విజయం కొరకు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పోటీ పడగా ప్రధానంగా పోటీ ఎంఐఎం, బీజేపీ మధ్య నడిచింది. మొత్తం 26 వార్డులు ఉన్న మున్సిపాలిటీలో ఎంఐఎం పార్టీ 15 స్థానాలలో గెలుపొందగా బీజేపీ పార్టీ 9 స్థానాలలో విజయం సాధించింది. 
 
భైంసా నియోజకవర్గంలో ఒక్క వార్డు కూడా గెలవకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ పరువు పోయిందనే చెప్పవచ్చు. రాష్ట్రం మొత్తం కారు హవా కనిపించినా భైంసాలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. భైంసాలో ఇంత ఘోరమైన ఫలితాలకు కారణమైన ముథోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై ఎంఐఎం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జాబిర్ అహ్మద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 
 
జాబిర్ మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం పార్టీని గెలిపించిన భైంసా మున్సిపాలిటీ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. భైంసాలో టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి సిగ్గు చేటు అని జాబిర్ విమర్శించారు. విఠల్ రెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకూడదని చెప్పారు. భైంసాలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామని జాబిర్ అహ్మద్ చెప్పారు. 
 
టీఆర్ఎస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కేసీఆర్ పరువు తీసేశారని అర్థం వచ్చేలా విమర్శలు చేయడం విఠల్ రెడ్డికి షాక్ అనే చెప్పాలి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో తిరుగులేని ఆధిక్యం సంపాదించుకున్న టీఆర్ఎస్ పార్టీ భైంసాలో 26 వార్డులలో ఒక్క వార్డులో కూడా గెలవలేకపోవడం, కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోవడం టీఆర్ఎస్ పార్టీకి కూడా షాక్ అనే చెప్పాలి.                                      

మరింత సమాచారం తెలుసుకోండి: