తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ దుమ్ము రేపే ప‌నితీరు క‌న‌బ‌రించింది. టీఆర్ఎస్ 107 మున్సిపాలిటీల్లో జయకేతనం ఎగురవేసింది. టాప్‌ గేర్‌లో కారు దూసుకుపోగా… ప్ర‌తిపక్షాలు కనీసం కనుచూపు మేరల్లో కూడా కనిపించలేదు. ఈ సంద‌ర్భంగా  టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

 

అసాధార‌ణ‌మైన ఈ విజ‌యం సాధించిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు అభినంద‌న‌లు తెలుపుతున్నామ‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌కు శిర‌సు వ‌హించి న‌మ‌స్క‌రిస్తున్నాన‌ని కేసీఆర్ తెలిపారు. ప్ర‌జ‌లు క‌ర్రుకాల్చి వాత‌పెట్టార‌ని అన్నారు. చెంప చెల్లుమ‌నిపించార‌ని ఇది మామూలు దెబ్బ కాద‌ని అన్నారు. వారి విమ‌ర్శ‌ల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. మా సెక్యుల‌ర్ విధానానికి క‌ట్టిన ప‌ట్టం ఇది అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

 

ఇదిలాఉండ‌గా,  మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి భారీ విజయం అందించిన తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ktr కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసిఆర్ నాయకత్వంపై ప్రజలు మళ్లీ విశ్వాసం ఉంచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.2014 నుంచి చేస్తూ వస్తున్న అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని అన్నారు. మొత్తం 120 మున్సిపాలిటీల్లో 100 కంటే ఎక్కువ మునిసిపాలిటీలను తమ పార్టీ గెలుచుకోవడం మామూలు విషయం కాదని కేటీఆర్ అన్నారు. 9 మున్సిపల్ కార్పొరేషన్లలో మొత్తం 9 లో గెలవడం గొప్ప విజయమని ట్విటర్ లో పేర్కొన్నారు.

 

 


కాగా, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అద్భుత విజయం సాధించిందని నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవిత ట్వీట్‌ చేశారు. తెలంగాణ ప్రజలకు తమ పార్టీకి అపూర్వ విజయాన్ని అందించారని ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన కవిత… గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని చెబుతూ…. జై తెలంగాణ !! జై టీఆర్ఎస్ !! జై కేసీఆర్ !! అని ట్వీట్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: