రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ భేటి అవుతున్నారు.  హఠాత్తుగా గవర్నర్ కార్యాలయం నుండి  స్పీకర్ కార్యాలయానికి సమాచారం అందిందని సమాచారం. మామూలుగా జనవరి 26వ తేది రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే ఎట్ హోం కార్యక్రమంలో కలుస్తారు. అలాగే ఉదయం జరిగే రిపబ్లిక్ డే పరేడ్ లో స్పీకర్ కూడా హాజరవుతారు.

 

అలాంటిది ఒక్కరోజు ముందే శనివారం సాయంత్రం ప్రత్యేకంగా తన కార్యాలయానికి స్పీకర్ ను గవర్నర్ ఎందుకు రమ్మన్నారన్న విషయం సంచలనంగా మారింది. ఇందుకు రెండు కారణాలున్నాయని అనుకుంటున్నారు. మొదటిదేమో అసెంబ్లీలో పాసయిన రెండు బిల్లులు శాసనమండలికి వెళ్ళిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా మంగళవారం, బుధవారం మండలిలో జరిగిన గొడవ అందరికీ తెలిసిందే.

 

అదే సమయంలో గురువారం నాడు మండలిలో జరిగిన గొడవను ప్రస్తావిస్తు జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు, ఎంఎల్ఏలు అసలు శాసనమండలి ఉనికినే ప్రశ్నిస్తు మాట్లాడిన సంగతి అందరూ చూసిందే. అదేరోజు మండలిలో జరిగిన గొడవపై చంద్రబాబునాయుడు గవర్నర్ ను కలిసి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అధికారపార్టీ ఎంఎల్సీలపై ఫిర్యాదు చేశారు.

 

ఈ సంఘటనలన్నింటి నేపధ్యంలో శనివారం రాజ్ భవన్ కు వచ్చి కలవమని ప్రత్యేకంగా గవర్నర్  కార్యాలయం నుండి స్పీకర్ కు సమాచారం అందటంతో కలకలం మొదలైంది.  పైగా శాసనమండలిలో రెండు రోజులు గొడవ జరిగినపుడు బిజెపి సభ్యులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళేమైనా కేంద్రానికి  సమాచారం ఇచ్చారేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. మండలిలో ఏమి జరిగిందో తెలుసుకోమంటూ  బహుశా కేంద్రం నుండి గవర్నర్ ను కోరారేమో అనే అనుమానాలు బయలుదేరాయి.

 

స్పీకర్ తో పాటు మండలి ఛైన్మన్ ఎంఏ షరీఫ్ తో కూడా గవర్నర్ మాట్లాడుదామని అనుకున్నారని సమాచారం. కాకపోతే ఛైర్మన్ అందుబాటులో లేరు. అందుకనే స్పీకర్ కు మాత్రం సమాచారం ఇచ్చారని అనుకుంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: