తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల గురించి స్పందించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎన్నికల్లో మొరిగిన వారందరికీ చెంపదెబ్బ అని కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు మానుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. 
 
కేసీఆర్ మాట్లాడుతూ విమర్శలు చేసే వారిని ఉద్దేశించి కుక్కలు మొరుగుతూనే ఉంటాయి... వాటికి అడ్డూ అదుపు లేదు...అని అన్నారు. ఒకడు ముఖ్యమంత్రి ముక్కు కోస్తానని అంటాడని ప్రజలు కర్ర కాల్చి వాతలు పెట్టినట్టు తీర్పు ఇచ్చారని అన్నారు. వ్యక్తిగత దూషణలు బంద్ చేయకపోతే కఠినంగా వ్యవహరిస్తానని కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 
 
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ ఎలక్షన్ లో తాను ఏ ఒక్కరితో కూడా మాట్లాడలేదని ఓటు వేసిన ప్రజలను అవమానిస్తారా..? అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు గౌరవంగా మరియు హుందాగా వ్యవహరించాలని కేసీఆర్ అన్నారు. కేటీఆర్ సహా ఇతర నేతలంతా 24 గంటలూ కష్టపడ్డారని అందువలనే ఇలాంటి ఫలితం వచ్చిందని చెప్పారు. 
 
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు. గెలుపు కొరకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని కేసీఆర్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలకు మొక్కాలని కేసీఆర్ అన్నారు. హద్దూ అదుపు లేకుండా విలువలకు పాతరేసి నోటికొచ్చినట్టు వ్యక్తిగత దూషణలకు దిగారని అన్నారు. ముక్కు కోస్తా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఇదేనా జాతీయ పార్టీల పద్ధతి అన్నారు. ఇదేనా ఆ పార్టీ సంస్కారం అని అన్నారు. ప్రజలే ఇలాంటి పార్టీలకు చెంప చెల్లుమనిపించాలని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: