ముందుగా ఊహించిన‌ట్లే...తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. మొత్తం 120 మున్సిపాలిటీలకు గానూ టీఆర్‌ఎస్‌ పార్టీ 100కు పైగా స్థానాల్లో విజయదుందుభి మోగించింది.  కారు స్పీడ్ కు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పత్తా లేకుండా పోయాయి. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాయి. ఎంఐఎం పార్టీ భైంసా, జల్ పల్లి మున్సిపాలిటీల్లో గెలిచింది. తుక్కుగూడ, ఆమన్ గల్ మున్సిపాలిటీల్లో భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ నాలుగు మున్సిపాలిటీల్లో గెలువగా.. మరో రెండు మున్సిపాలిటీల్లో ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ గెలిచింది. అయితే, ఈ గెలుపు అనంత‌రం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల ఈ విజయం సాధ్యమైందని ఆయ‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప‌ట్ట‌ణాల‌కు కీల‌క హామీలు ఇచ్చారు. 

 

టీఆర్ఎస్ పార్టీ  వెన్నుతట్టి తమను ముందుకు నడిపిస్తున్న తెలంగాణ ప్రజానీకానికి ధన్యవాదాల‌ని కేసీఆర్ తెలిపారు. అభివృద్ధిలో అందరిని కలుపుకుపోతున్నామ‌ని, ఇది ప్రజలకు నచ్చిందని కేసీఆర్ విశ్లేషించారు. `` ఇటువంటి ఘన విజయం సాధించడం మమూలు విషయం కాదు . విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరూ కలిసి చక్కటి ఫలితాలు సాధించారు``.అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప‌ట్ట‌ణాల అభివృద్ధికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం మాదిరిగానే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని త్వరలోనే అమలు చేస్తామ‌ని తెలిపారు.

 

``ఈ ఎన్నికల్లో ఎన్నికైనా వారికి పట్టణాభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ ఇస్తాం. పట్టణాల అభివృద్ధి, నగరీకరణలో సవాళ్లపై అవగాహన కల్పిస్తాం. ప్రజలు తమపై పెట్టుకున్న సంపూర్ణ విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.  పల్లె ప్రగతి ద్వారా సాధించిన ఫలితాలను తెలంగాణ పట్టణ ప్రగతి ద్వారా పట్టణాల్లో సాధించాలి.`` అని తెలిపారు. బీజింగ్‌ తర్వాత అత్యధిక కాలుష్యాన్ని ఢిల్లీ ఎదుర్కుంటోంద‌ని కేసీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ``హైదరాబాద్‌కు వస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. నగరానికి పరిశ్రమలు వస్తుంటే సంతోషంతో పాటు భయం కూడా కలుగుతోంది. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వసతులు కల్పించడం మా ముందున్న ప్రధాన సవాలు. 20 ఎకరాల్లో సెంటర్‌ ఫర్‌ అర్బన్‌ ఎక్సలెన్సీని ఏర్పాటు చేస్తాం` అని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: