ప్రతి ఎన్నికల్లోనూ కొన్ని కొన్ని చిత్ర, విచిత్రాలు జరుగుతూనే ఉంటాయి. కొంత మంది అభ్యర్థులు అతి స్వల్పం ఓట్ల తేడాతో ఓటమి చెందడంతో , సమానంగా ఓట్లు వచ్చి సందిగ్ధంలో పడడంతో జరుగుతుంటాయి. మరికొందరు మాత్రం ఊహించని పరిణామాలతో గెలుపుని తమ ఖాతాలో వేసుకుంటూ ఉంటారు. ఇదంతా అదృష్టం అని చెప్పాలో లేక మరో విధంగా చెప్పాలో తెలియదు కానీ ఊహించని విధంగా కొన్ని కొన్ని ఎన్నికల ఫలితాలు గమ్మత్తు కలిగిస్తాయి. తాజాగా నిన్న జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఇటువంటి విచిత్రమైన పరిస్థితి ఎదురయింది. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఎవరూ ఊహించని విధంగా మున్సిపాలిటీలను సొంతం చేసుకోవడమే కాకుండా, బలమైన రాజకీయ పార్టీగా గుర్తింపు సాధించింది.


విషయానికి వస్తే.... కొంపల్లి మున్సిపాలిటీలో ఓ అభ్యర్థి విజయాన్ని సాధారణ స్కేల్ నిర్ణయించడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పరిశీలిస్తే ... మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీ గా తలపడ్డాయి. కానీ ఫలితాల విషయంలో అన్ని వార్డుల్లోనూ ఓటర్లు గెలిపిస్తే మూడో వార్డు లో మాత్రం ఓ సాధారణ స్కేల్ విజయాన్ని డిసైడ్ చేసింది. ఈ స్థానంలో పోటీ చేసిన టిఆర్ఎస్, బిజెపి అభ్యర్థులు ఇద్దరికీ సమానంగా ఓట్లు  వచ్చాయి. టిఆర్ఎస్ నుంచి సన్న శ్రీశైలం యాదవ్, బీజేపీ నుంచి మోహన్ రెడ్డి ఇద్దరికీ 356 ఓట్లు చొప్పున వచ్చాయి. కానీ ఒక ఓటు మాత్రం రెండు పార్టీల గుర్తుల మధ్య ఉండిపోవడంతో ఈ ఫలితాన్ని ఎలా ప్రకటించాలో తెలియక అధికారులు సతమతమయ్యారు. 


ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు తమ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేయడంతో ఆ బ్యాలెట్ పేపర్ ను స్కేల్ సహాయంతో కొలిచి ఎక్కువ వైపు భాగం టీఆర్ఎస్ వైపు ఉన్న కారణంగా అది టిఆర్ఎస్ కు ఓటు గా గుర్తించి ఆ పార్టీ అభ్యర్థి సన్న శ్రీశైలం యాదవ్ గెలిచినట్టుగా ప్రకటించారు. దీంతో ఓ సాధారణ స్కేల్ తన  రాజకీయ జీవితాన్ని మార్చేసింది అనుకుంటూ టిఆర్ఎస్ అభ్యర్థి ఆనందపడగా బీజేపీ అభ్యర్థి ఇది అన్యాయం అంటూ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అదీ సంగతి !

మరింత సమాచారం తెలుసుకోండి: