గత ఏడు నెలల్లో రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమ రాలేదు. ఒకరికి కూడా శాశ్వత ఉద్యోగం, ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు.   ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కు నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను వేదిస్తున్నారు. యువత సంక్షేమం అటకెక్కి ఒక దశ దిశ లేకుండా నడుస్తున్న విషయాన్ని ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నామని అన్నారు. 

          గడిచిన ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో ఆంధ్రప్రదేశ్‌ నాలెడ్జ్‌ హబ్‌ గా రూపుదిద్దుకుంది. 13 జిల్లాల్లోని యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి బాటలు వేసే అనేక కార్యక్రమాలను చేపట్టింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నైపుణ్య శిక్షణ కల్పించి తద్వారా ఉద్యోగాలు సృష్టించింది.  అన్ని రంగాల్లో కలుపుకుని సుమారు 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే. చంద్రబాబు నాయుడు గారి పాలనలో అమరావతికి ఇప్పటికే విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమిత్‌, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ తదితర ప్రసిద్ధ యూనివర్సిటీలు వచ్చాయి. దేశంలో టాప్‌ క్లాస్‌ స్కూళ్లు ఎనిమిది ఉంటే... అందులో ఏడు మన అమరావతిలోకే వచ్చాయి.

 

          వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా యువతకు ఉపాధి లేదు. సంపద సృష్టించడం రాదు కానీ వైసీపీ కార్యకర్తల  కోసం ఉద్యోగాలు సృష్టించడం బాగా తెలుసు.  వైసీపీకి కూల్చడమే తెలుసు కానీ  పాలన  చేతకాదు. ఆర్భాటంగా చెప్పిన వైసీపీ నవరత్నాల్లో ఎన్ని అమలు అయ్యాయి? జనాలకు ఎన్ని చేరువయ్యాయి? నూటికి నూరు శాతం ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ చెల్లిస్తానని ఎన్నికల ముందుకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పారు. తుగ్లక్‌ నిర్ణయాలతో పైసా ఖర్చు లేకుండా అన్ని కార్యకలాపాలు నిర్వహించడానికి అనుకూలంగా ఉన్న అమరావతిని వదిలి వేల కోట్ల రూపాయల వ్యయం చేస్తూ రాజధాని తరలిస్తామంటున్నారు కానీ ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, ఉపకార వేతనాలకు రూపాయి కూడా విడుదల చేయకపోవడం దుర్మార్గం.

 

          ప్రజా రాజధాని అమరావతి తరలింపుతో యువత కోలుకోలేని విధంగా భవిష్యత్‌ అంధకారమవుతుంది. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే లులూ, అదానీ గ్రూప్‌ లతో చేసుకున్న ఒప్పందాలు రద్దయ్యాయి. కియా పరిశ్రమను విస్తరించే విషయంలో యాజమాన్యం పునరాలోచనలో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: