కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బీజేపీ పార్టీలో చేరనున్నారని మళ్లీ పాత జెండానే కప్పుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. నిజానికి ముద్రగడ పద్మనాభం బీజేపీ పార్టీకి కొత్తేమీ కాదు. దాదాపు 22 సంవత్సరాల క్రితం కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ముద్రగడ పద్మనాభం బీజేపీ పార్టీలో చేరారు. దేశమంతటా వాజ్ పేయి ప్రభంజనం ఉన్న సమయంలో ముద్రగడ పద్మనాభం బీజేపీ పార్టీలో చేరడంతో గోదావరి జిల్లాల్లో రెండు ఎంపీ సీట్లు బీజేపీ పరం అయ్యాయి. 
 
కానీ ఆ తరువాత బీజేపీ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు తాజాగా ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లి మరీ ముద్రగడతో చర్చలు జరిపారు. బీజేపీ పార్టీ కాపులకు పెద్ద పీట వేస్తోందని అందువలన బీజేపీ పార్టీలో చేరాలని సోము వీర్రాజు ముద్రగడ పద్మనాభం ను కోరినట్టుగా తెలుస్తోంది. కానీ ముద్రగడ పద్మనాభం మాత్రం తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని కాపులను బీసీల్లో చేర్చే అంశమే తనకు ముఖ్యమని చెప్పినట్టు సమాచారం. 
 
బీజేపీ పార్టీలో చేరి పదవులను పొందితే తనపై కాపు ద్రోహి అని ముద్ర పడుతుందని ముద్రగడ పద్మనాభం భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఏపీలో బీజేపీ పార్టీ సామాజిక సమీకరణాలతో ఎదగాలని భావిస్తోంది. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ముద్రగడ పద్మనాభంను పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తోంది. 
 
కాపు వర్గానికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా బలపడాలని బీజేపీ పార్టీ భావిస్తోంది. బీజేపీ పార్టీ కాపు రిజర్వేషన్ల అంశం గురించి కూడా సానుకూలంగా ప్రకటన చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పార్టీలోకి కాపు కీలక నేతలను చేర్చుకోవడం ద్వారా కాపు వర్గాన్ని తమవైపు తిప్పుకోవచ్చనేది బీజేపీ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. బీజేపీ కాపు రిజర్వేషన్ల విషయంలో స్పష్టత ఇస్తే మాత్రం ముద్రగడ ఖచ్చితంగా బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: