పేగు తెంచుకుని క‌ని పెంచేదే అమ్మ‌. త‌న క‌మ్మ‌టి ప్రేమ‌తో అనురాగాన్ని పంచే అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువ‌నే చెప్పాలి. అలాంటి అమ్మ ఉండాల్సింది అనాథాశ్ర‌మంలో  కాదు. వ‌య‌స‌య్యాక త‌న బిడ్డ ఒడిలో ఉండాలనుకుంట‌ది అమ్మ‌. అమ్మ కలకాలం బతకాలి. అమ్మ మనతోపాటే ఉండాలి. ఈ సృష్టిలో అమ్మకన్నా గొప్పది ఎవ్వ‌రూ మ‌న‌ల్ని ప్రేమించ‌రు. జన్మనిచ్చిన తల్లికి ఏమిచ్చినా తక్కువే. ఆమె రుణం తీర్చుకోలేనిది. నవమాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి మనల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన దేవతామూర్తి అమ్మ! ఆలనా పాలనా చూసి, కనీ, పెంచీ, పెద్దచేస్తే- అమ్మకు మనం ఇచ్చే విలువ మాత్రం వ‌య‌స‌య్యాక ఆమెను తీసుకెళ్లి అనాధ‌శ్ర‌మంలో ఉంచ‌డం. లేదా ఒంట‌రిగా అనాధ‌లాగా వ‌దిలెయ్య‌డం ఇవి రెండే ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. 

 

నేటి త‌రం త‌మ త‌ల్లిని ఏమాత్రం చూసుకుంటున్నారు. ఏమాత్రం ప్రేమ‌ను పంచుతున్నారు? అన్న ప్ర‌శ్న‌లు వ‌స్తే అస‌లు ప్రేమ‌నే మాట‌కే అర్ధం ఉండ‌డం లేదు. క‌నీసం త‌ల్లితో ఒక నాలుగు నిమిషాల ఫోన్ మాట్లాడే స‌మ‌యం కూడా ఉండ‌డం లేదు. ప్ర‌స్తుతం ఉన్న పోటీ ప్రపంచం నిజమే! కానీ ఆ నెపంతో అమ్మలను అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఎక్కడో పల్లెటూళ్లో విడిచి పెట్టి రెక్కలు గట్టుకుని పట్టణాలకు ఎగిరిపోతున్నారు. ఉద్యోగం ముసుగులో ముసలివాళ్లను దిక్కులేని వాళ్లను చేస్తున్నారు. పెళ్లిళ్లకూ శుభకార్యాలకు వీడియో తీస్తున్నారు కానీ… అసలు తీయాల్సింది సిజేరియన్లకు! అప్పుడుగానీ తెలియదు కన్నతల్లి కడుపుకోతేంటో? కన్నబిడ్డలే కాదుపొమ్మంటే- ముసలి తల్లిదండ్రులు ఎక్కడుండాలో తెలియక ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్నారు. అందరూ ఉన్నా అనాథల్లా బతుకుతున్నారు. జగమంత కుటుంబంలో ఏకాకి జీవితం గడుపుతున్నారు.

 

అనాథలైన తల్లిదండ్రుల్లో ఎక్కువ అవస్థలు ప‌డేది తల్లులదే! ఎందుకంటే భర్తలను పోగొట్టుకుని,  బిడ్డ‌లు చేర‌దీయ‌క చివ‌ర‌కు అనాధుల్లా మిగిలేది వారే ఎక్కువ‌. వాళ్లుపడే నరకయాతన అంతా ఇంతా కాదు. మంచి చెడు మాట్లాడుకోవ‌డానికి ఎవ్వ‌రూ ఉండ‌రు. ఏదీ మ‌న‌సువిప్పి ఎవ్వ‌రికీ చెప్పుకోలేరు. ప్రతీదీ డబ్బుతో కొలిచే ఈ తరానికి- ఆ పచ్చనోట్లతో వెలకట్టలేని కన్నపేగు ఒకటుంటుందనే విషయం తెలియదు. తెలిస్తే ఇలా జరగదు. చిన్నప్పుడు ఏడిస్తే కొంగుతో తుడిచే అమ్మ మనసుని- పెద్దయ్యాక కన్నీళ్లపాలు చేయడం ఎంతవరకు సబబు. ఉద్యోగం, కెరీర్‌. జీవితమంటే ఇదేనా? అమ్మతో గడపడానికి బొత్తిగా పదినిమిషాలు కూడా దొరకడం లేదా? సెలవులొస్తే భార్యాబిడ్డలతో గడపడానికి మాత్రం వదులుకోరు. అదే అమ్మను చూడాలనంటే సవాలక్ష వంకలు. మారాలి ఈ త‌రం మారి త‌ల్లిదండ్రుల విలువ‌ను తెలుసుకోవాలి. ఈరోజు వాళ్ళు రేపు మ‌న‌మే వాళ్ళ ప‌రిస్థితికి వ‌స్తాం. ఈ ప‌రిస్థితి నుంచి ఎవ్వ‌రూ త‌ప్పించుకోలేరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: