అబ్బెబ్బే ... ఎవరు ఎన్ని అనుకున్నా ఏపీ సీఎం జగన్ మాత్రం తనకు మంచి అనుకున్నది చేసేందుకు ముందు వెనక ఆలోచించకుండా ముందుకు వెళ్తూ ఉంటారు.తన నిర్ణయాలు మొదట్లో కొంతమందికి మింగుడు పడక పోయినా... వివాదాస్పదమైన ఆ తర్వాత మాత్రం జగన్ నిర్ణయాన్ని అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. ఇది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చాలాసార్లు రుజువైంది. ఇక ఇప్పుడు ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని జగన్ పట్టుదలతో ఉన్నారు. 


దానికి అనుగుణంగా ఆయన వేగంగా నిర్ణయాలు తీసుకుని శాసనసభలో బిల్లును ఆమోదించుకున్నారు. అయితే మండలిలో మాత్రం ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. దీంతో శాసన మండలి రద్దు చేయడమో లేక టిడిపి ఎమ్మెల్సీలను తన దారికి తెచ్చుకోవడమా అనే విషయంపైనే జగన్ ఇప్పుడు దృష్టి పెట్టారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్సీలను వైసీపీ వైపు మద్దతుగా తీసుకొచ్చేందుకు కొంతమంది మంత్రులకు  జగన్ బాధ్యతలు అప్పచెప్పారు. రాజధాని బిల్లుని మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించడం పై ప్రజల్లోనూ విస్తృతమైన చర్చ జరుగుతోంది. 


ఈ విషయంలో టిడిపి ఎక్కువగా ఆందోళన చెందుతుంది. అందుకే పైకి ధైర్యం నటిస్తూ మండలి రద్దు అనే అంశం వైసీపీ ప్రభుత్వం చేతిలోలేదని ప్రకటిస్తోంది. మండలి పరిణామాల పై ప్రభుత్వం సీరియస్ అయిన దగ్గరనుంచి చంద్రబాబు ఆయన అనుకూల మీడియా ఆందోళన చెందుతూనే ఉంది. ఇదేదో పెద్ద తప్పిదం అన్నట్టుగా ప్రచారం చేస్తోంది. టిడిపిలో ఉన్న మండలి సభ్యులు ఎక్కడ వైసీపీ వైపు వెళ్తారో అనే ఆందోళనలో ఆ పార్టీ ఉంది. అందుకే శాసనమండలి చైర్మన్ పై దాడి, దూషణ అంటూ టిడిపి ప్రచారానికి దిగింది. 


అయితే జనాలు మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు. శాసనమండలి రద్దు అవుతుందా లేదా అనే విషయంపై ప్రధానంగా అందరి దృష్టి ఉంది. నిజంగా జగన్ కనుక మండలిని రద్దు చేసేందుకు ముందుకు వెళ్లి కేంద్రాన్ని కూడా ఒప్పించగలిగితే ...టీడీపీలో దాదాపు 30 మంది ఎమ్మెల్సీలు పదవి పోగొట్టుకుంటారు. టిడిపి కొంతమంది నాయకులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి పార్టీ కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఈ పదవులు కూడా లేకపోతే వారిలో చాలామంది పార్టీలో ఉండేందుకు కూడా ఇష్టపడరు. 


ముఖ్యంగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. దీంతో ఏదో విధంగా మండలి రద్దు కాకుండా చూసుకోవడంతో పాటు తమ పార్టీ ఎమ్మెల్సీలు ఎవరు వైసీపీ వైపు వెళ్లకుండా టిడిపి జాగ్రత్త పడుతోంది. ఏమైనా మండలి రద్దు అనే అంశాన్ని తీసుకు వచ్చి జగన్ టిడిపీని ఆందోళనకు గురిచేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: