మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రజాస్వామిక వాదులు ఎన్నికల్లో ఏ ఏ అంశాలు ప్రభావం చూపాయో చర్చించాలన్నారు.  కాంగ్రెస్ గెలుపోటములకు పొంగిపోదు, కృంగిపోదని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ ఎన్నుకున్న ఆయుధం బ్లాక్ మెయిల్ అని తీవ్రం ఆరోపణ చేశారు. ఓడిపోతే పదవులుండవని మంత్రులను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేశారని విమర్శించారు.  దాంతో వారు కాంగ్రెస్ నేతల పై అడ్డగోలుగా కేసులు పెట్టి, బెదిరించారన్నారు.  

ఎన్నికల్లో కేసీఆర్ ప్రజలను, ఓటర్లను నమ్ముకోలేదని రేవంత్ రెడ్డి అన్నారు. డబ్బులు, మద్యం, పోలీస్ , ఎన్నికల నిర్వహణ అధికారులపై ఆధారపడి నెగ్గారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో టిఆర్ఎస్ అభివృద్ధి ని ఎక్కడా ప్రస్తావించలేదని ఆక్షేపించారు. కొంపల్లి లో ఎన్నికల నిర్వాహకులు.. గెలిచిన అభ్యర్థులను ఓడినట్లు చూపించారని ఎత్తిచూపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన మంత్రులు ఎర్రబెల్లి, కేటీఆర్, మల్లారెడ్డి, గంగుల కమలాకర్ పై ఎన్నికల సంగం ఎందుకు చర్యలు తీసుకోలేదని సూటిగా ప్రశ్నించారు.

25 మున్సిపాలిటీల్లో టిఆర్ఎస్ కు 50శాతం వార్డులు రాలేదని చెప్పారు. అయినా అక్కడ టిఆర్ఎస్ గెలిచినట్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో కేటిఆర్ ను వ్యతిరేకిస్తూ 10మంది గులాబి దండు,  గజ్వల్ లో కేసీఆర్ ను వ్యతిరేకిస్తూ 6మంది టిఆర్ఎస్ వ్యతిరేకులు గెలిచారని చెప్పారు. త్వరలోనే విద్యుత్ చార్జీలు డబుల్, ఇంటి పన్ను ఆరంతలు పెరుగుతుంది.

మిషన్ భగీరథ నీరుకు నాలుగంతలు పెంచి బిల్లు వసూలు చేస్తారు.  టిఆర్ఎస్ గెలుపు ప్రజలకు పన్నుల మోత మోగించబోతుంది. ఈ ఎన్నికలు బ్లాక్ మెయిల్ తో మొదలై, బ్లాక్ మనీ తో ముగుస్తున్నాయి. ఈ ఫలితాలు మమ్మల్ని ఏ మాత్రం కృంగదీయవని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ తరపున పోరాడుతానే ఉంటామని చెప్పారు. టిఆర్ఎస్ కు ఎంఐఎం ప్రత్యక్ష భాగస్వామి, బీజేపీ పరోక్ష భాగస్వామి అని ఆరోపించారు. కేసీఆర్ తో అవగాహన లేకుంటే బంగారు కూలి పేరిట చేసిన అవినీతి ఫైల్ ను కేంద్రం ఎందుకు తొక్కి పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: