శాసనమండలి రద్దుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మండలి రద్దుకు ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో చర్చ జరిగిందని, కాకపోతే కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని రకాల వర్గాలు సలహాలని తీసుకుంటే మంచిదని కాస్త సమయం ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇక మండలి సమావేశాల ఆఖరి రోజు టీడీపీ తీరు దారుణంగా ఉందని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాలుగు గంటల పాటు ఒకే సీటులో కూర్చుని, ఛైర్మన్‌ని కనుసైగ చేసి, బిల్లులని సెలక్ట్ కమిటీకి పంపేలా చేశారని చెప్పారు.

 

అయితే బిల్లులని సెలక్ట్ కమిటీకి పంపడం వల్ల పోయేది ఏమి లేదని, మహా అయితే మూడు నెలల వరకు బిల్లులు పెండింగ్‌లో పడతాయని, ఆ తర్వాత ఆమోదం పొంది మూడు రాజధానులు నిర్ణయం సజావుగా అమలవుతుందని చెప్పారు. 151 మంది ఎమ్మెల్యేలు ప్రజా మద్ధతు గెలిపొందారని, అలాంటిది ప్రజల మద్ధతు లేని టీడీపీ మండలిలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడిందని మండిపడ్డారు. కానీ మండలి రద్దుపై అందరి అభిప్రాయం తెలుసుకునేందుకే మూడు రోజుల పాటు నిర్ణయం వాయిదా వేశారని, అంతేగానీ టీడీపీ ఎమ్మెల్సీలని లాగేయాలసిన అవసరం తమకు లేదని చెప్పారు.

 

సీఎం జగన్ ఓ పద్దతి ప్రకారం ముందుకెళుతున్నారని, రూ. 5, 10 కోట్లు ఇచ్చి టీడీపీ ఎమ్మెల్సీలని ప్రలోభపెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. భవిష్యత్‌లో తమ పార్టీకి ఎమ్మెల్సీలు పెరుగుతాయని తెలిసిన కూడా, మండలి వల్ల ఆర్ధిక భారం తప్ప పెద్ద ఉపయోగం లేదని తెలిసే రద్దుపై నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఇక ఓటుకు నోటు కేసులో చంద్రబాబు హడావిడిగా పారిపోయి వచ్చి, తన స్వార్ధం కోసం అమరావతిని రాజధానిగా చేశారని విమర్శించారు.

 

అయితే అమరావతి నిర్మాణం ఆర్ధిక భారంతో కూడుకున్న పని అని, పైగా అభివృద్ధి ఇక్కడే చేస్తే, రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని, అలా జరగకూడదనే మూడు రాజధానులని ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఈ నిర్ణయానికి ప్రజల ఆమోదం ఉందని, అలాంటి నిర్ణయాన్ని అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని, టీడీపీ ఎంత ప్రయత్నించిన ఈ నిర్ణయం ఆగదని సజ్జల అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: