ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల బిల్లు విషయంలో శాసన మండలి ఛైర్మన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శాసన మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేసినట్టు సమాచారం అందుతోంది. శాసన మండలి ఛైర్మన్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు కోసం ఒక సెలెక్ట్ కమిటీని, సీఆర్డీఏ బిల్లు రద్దుకు సంబంధించి మరొక సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 
 
అధికార, విపక్షాలను సెలెక్ట్ కమిటీకి సభ్యుల పేర్లను ఇవ్వాలని ఛైర్మన్ ఇప్పటికే లేఖలు రాశారు. సెలెక్ట్ కమిటీలో టీడీపీ నుండి ఐదుగురు, వైసీపీ నుండి ఒక్కరు, బీజేపీ పార్టీ నుండి ఒక్కరు, పీడీఎఫ్ పార్టీ నుండి ఒక్కరు సెలెక్ట్ కమిటీలో ప్రాతినిథ్యం వహించనున్నట్టు తెలుస్తోంది. బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు సెలెక్ట్ కమిటీలకు ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు. 
 
ఒక్కో సెలక్ట్ కమిటీలో తొమ్మిది మంది సభ్యులు ఉండనున్నారని తెలుస్తోంది. సెలెక్ట్ కమిటీలో సభ్యులు ఎవరు ఉంటారనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. టీడీపీ పార్టీ నుండి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్, యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్, బచ్చుల అర్జునుడు సెలెక్ట్ కమిటీలో సభ్యులుగా ప్రాతినిథ్యం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. 
 
చంద్రబాబు తనకు అత్యంత నమ్మకంగా ఉండేవారిని మాత్రమే సెలెక్ట్ కమిటీకి పంపనున్నట్టు తెలుస్తోంది. వైసీపీ పార్టీ నుండి ఒక మంత్రి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మూడు రాజధానుల బిల్లు గురించి, సీఆర్డీఏ బిల్లు గురించి సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేయడం జగన్ కు షాక్ అనే చెప్పాలి. సెలెక్ట్ కమిటీల వలన మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందటానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో ఏ విధంగా ముందుకు వెళతారో చూడాల్సి ఉంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: