తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ఒకప్పుడు వరుసగా అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ చరిస్మా గంగలో కలిసిపోయింది... కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని దుస్థితి వచ్చింది. ఇప్పటికీ అందరు నేతలు పార్టీని వీడి ఇతర పార్టీలో చేరగా ఉన్న కొంతమంది నేతలు కూడా... ఒక్క  తాటిపై నడవడం లేదు. కాంగ్రెస్ లో ఎప్పుడు అంతర్గత కుమ్ములాటలు. ఏ పార్టీ నేతలైన ఎన్నికలు వచ్చాయి అంటే ఒక్క తాటిపై నడుస్తూ పార్టీ విజయం కోసం సర్వ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎన్నికలప్పుడే ఎక్కువ కుమ్ములాటలు. దీంతో పార్టీని నేతలందరూ పార్టీని  ప్రజల్లోకి తీసుకెళ్లలేకపాయె... సక్కగా ప్రచారమే చేయకపాయె..ఇక విజయం కూడా పాయె పాయె... దీంతో పార్టీ పరువు గంగలో కలిసిపాయే. 

 

 

 తెలంగాణలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇదే జరుగుతుందని ప్రజలు అంటున్న మాట. మాకు కాంగ్రెస్ పార్టీ వద్దు అని కాంగ్రెస్ నేతలకు ఇండైరెక్ట్ గా ప్రజలు ఎన్నికలతో సమాధానం చెబుతున్నప్పటికీ... కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది అంటూ ప్రతి ఎన్నికల ముందు ధీమా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజానీకం మొత్తం తగిన బుద్ధి చెప్పినప్పటికీ... తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు మాత్రం మారడం లేదని పలువురు భావిస్తున్నారు. ఉన్నదే కొంతమంది నేతలు అయితే వాళ్ల మధ్య అంతర్గత కుమ్ములాటలు మాత్రం మితిమీరిపోతున్నాయి. 

 

 

 ఇక తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. పీసీసీ పదవి కోసం ఆశపడిన ప్రతి ఒక్కరూ ఆయా నియోజకవర్గాల్లో తమ గెలుపు కోసం సర్వ ప్రయత్నాలు చేశారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ గెలవాలి అని కోరుకునే వారు మాత్రం చాలా తక్కువే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అవును ! మితిమీరిన అంతర్గత కుమ్ములాటలతో నిత్యం కీచులాడుకుంటున్న  కాంగ్రెస్ కు... తెలంగాణ ప్రజలందరూ మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారు. ఆ పార్టీ ఆ విజయాన్ని నమోదు చేయలేక చతికిలబడి పోయింది.రోజు  రోజుకు కాంగ్రెస్ పరిస్థితి దిగజారి పోతున్న సమయంలో పార్టీ నేతలందరూ ఒకతాటిపై నడిచి కాంగ్రెస్ పార్టీ పుంజుకునేలా చేస్తారా లేదా అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: