శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ వ్యవహారం చూస్తుంటే అందరికీ  అనుమానంగా ఉంది.  వెనకనుండి ఎవరో ఛైర్మన్ ను నడుపుతున్నట్లే ఉంది. లేని అధికారాలను ఉన్నాయని చెప్పి సెలక్ట్ కమిటి పరిశీలనకు రెండు బిల్లులను పంపుతున్నట్లు ప్రకటించారు.  ఇది సరిపోదన్నట్లుగా తాజాగా  రెండు సెలక్ట్ కమిటీలను నియమించటం చూస్తుంటే అధికారపార్టీతో ఛైర్మన్ యుద్ధానికి రెడీ అయ్యారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.  

 

అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులపై  శాసనమండలిలో రెండు రోజులు ఎంత రచ్చయ్యిందో అందరికీ తెలిసిందే.  అయితే బిల్లులను ఆమోదించాలి. లేకపోతే ఓడగొట్టాలి. అంతే కానీ సెలక్ట్ కమిటికి పంపే అధికారం తనంతట తానుగా ఛైర్మన్ కు లేదు. ఇక్కడే తనకు విచక్షణాధికారాలు ఉన్నాయంటూ ఛైర్మన్ రూల్ 154 అంటున్నారు. నిజానికి  తన విచక్షణాధికారులను ఉపయోగించి సెలక్ట్ కమిటికి పంపాలని ఛైర్మన్ డిసైడ్ చేసినా దానిపై ముందు ఓటింగ్ జరగాలి. కానీ అలాకూడా జరగలేదు. అసలు నిబంధనలు, సంప్రదాయాలు స్పష్టంగా లేనపుడే విచక్షణాధికారులను ఉపయోగించాలి. కానీ ఇక్కడ అన్నీ స్పష్టంగా ఉన్నా ఛైర్మన్ విచక్షణాధికారాలని అనటమే విచిత్రంగా ఉంది.  

 

ఇలా ప్రతి అడుగులోను  తప్పు మీద తప్పు చేస్తున్న ఛైర్మన్ తాజాగా రెండు సెలక్ట్ కమిటిలను నియమిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి నిబంధనల ప్రకారం సెలక్ట్ కమిటిలను నియమించినా అప్పటికప్పుడే కమిటిల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. లేదా  ఓ రెండు రోజుల తర్వాత కమిటిలను డిసైడ్ చేస్తామని చెప్పాలి. అలా షరీఫ్ మాత్రం ఏమీ ప్రకటించకుండానే శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేసేశారు.

 

సరే ఛైర్మన్ చెప్పినట్లే కమిటిలు వేశారనే అనుకుందాం. టిడిపి నుండి ఐదుగురు, బిజెపి, పిడిఎఎఫ్, బిజెపిల నుండి చెరో సభ్యుడు ఉంటారని చెప్పారు. రెండు కమిటీలకు ఛైర్మన్లు గా మంత్రులు బొత్సా సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధరెడ్డి ఉంటారని చెప్పారు. ఛైర్మన్ వేశాడు కాబట్టి టిడిపి సభ్యులు రెడీ అయిపోతారు. మరి మిగిలిన పార్టీలు  సభ్యుల పేర్లను ఇవ్వకపోతే ఏమవుతుంది ? ఇచ్చినా ఛైర్మన్లుగా మంత్రులు సమావేశాలు నిర్వహించకపోతే ఏమవుతుంది ? ఒక్క ప్రకటనతో  ఛైర్మన్ వ్యవహారం మొత్తాన్ని కంపు చేసేశారు.

 

ఇదంతా చూస్తుంటే నిబంధనలకు విరుద్ధంగా ఉద్దేశ్యపూర్వకంగానే ఛైర్మన్ వ్యవహరిస్తున్నట్లు అర్ధమైపోతోంది. ఛైర్మన్ ను వెనకనుండి చంద్రబాబునాయుడే నడుపుతున్నాడనే ఆరోపణలు వినబడుతున్నాయి. మొత్తానికి తెరవెనుక ఎవరున్నా ముందున్నది మాత్రం షరీఫే. అంటే జగన్మోహన్ రెడ్డితో నేరుగా  యుద్ధం చేయలేక చంద్రబాబే మండలి ఛైర్మన్ ను ముందుకు తోస్తున్నారని అర్ధమైపోతోంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: