కొన్ని విషయాల్లో చంద్రబాబు తెలివితేటలు, ప్లానింగ్ ను మెచ్చుకోకుండా ఉండలేం. ఉద్దేశ్యాలు, తెర వెనుక బాగోతాల సంగతి ఎలా ఉన్నా.. అమరావి కోసం ఆయన భూసమీకరణ చేసిన తీరు మాత్రం చెప్పుకోదగిందే. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ఏకంగా 30 వేల ఎకరాల భూమి సమీకరించడం అంటే మాటలా.. ఈ అద్భుతమైన ఫీటు దేశంలోనే ఓ రికార్డని.. కాదు.. కాదు ప్రపంచంలోనే రికార్డని ఆయన అనుచరులు గర్వంగా చెప్పుకుంటుంటారు.

 

అందుకే ఇప్పుడు జగన్ కూడా ఆయన బాటలోనే వెళ్తున్నాడు. పేదల ఇళ్ల స్థలాల కోసం విశాఖలో భూ సమీకరణకు సిద్ధమవుతున్నాడు. ఇందుకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులిచ్చిశాడు. విశాఖ నగరంలో ల్యాండ్ పూలింగ్ కోసం జగన్ సర్కారు మార్గదర్శకాలను విడుదల చేసింది. విశాఖలో మొత్తం 6 వేల పైచిలుకు ఎకరాలను భూ సమీకరణ విధానం ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

 

చంద్రబాబు రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ చేస్తే.. జగన్.. పేదలందరికీ ఇళ్లు పథకం అమలు కోసం భూసమీకరణ విధానాన్ని అమలు చేయబోతున్నాడు. మొత్తం 10 మండలాల్లో లాండ్ పూలింగ్ ద్వారా 6 వేల ఎకరాలు సేకరించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. భూసమీకరణ ప్రక్రియ అంతా విశాఖ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరగాలని నిర్దేశించింది. విశాఖ మెట్రోపాలిటన్ కమిషనర్ భూమిని అభివృద్ది చేసి తిరిగి కలెక్టర్ కి అప్పగిస్తే, ఆ భూమిని పేదల ఇళ్లపట్టాల కోసం వినియోగిస్తారని ఉత్తర్వుల్లో వివరించారు.

 

వారం రోజుల్లోగా ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. ఐదునెలల్లోగా అభివృద్ధి చేసిన భూమిని పంపిణీ ప్రక్రియ పూర్తి కావాలని నిర్దేశించింది. ఇళ్ల స్థలాల కోసం ఒక్క విశాఖ జిల్లాలోనే లక్షా 50 వేల 584 మంది లబ్ధిదారులు ఉన్నట్టు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: