ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు ప్రజల ఇంటి వద్దకు చేరాలనే సదుద్దేశంతో గ్రామ, వార్డ్ వాలంటీర్లను నియమించిన విషయం తెలిసిందే. కానీ కొందరు గ్రామ, వార్డ్ వాలంటీర్ల పనితీరు వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. కొందరు గ్రామ వాలంటీర్లు ప్రజల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గతంలో వినిపించాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో ఒక గ్రామ వాలంటీర్ చేతివాటం చూపించి అమ్మఒడి డబ్బులు స్వాహా చేశాడు. 
 
పూర్తి వివరాలలోకి వెళితే చిత్తూరు జిల్లా వి కోట మండలం ముదరందొడి పంచాయతీ నడిపేపల్లిలో తన కుటుంబంతో కలిసి మీరాజ్ అనే మహిళ నివశిస్తోంది. జనవరి నెల 9వ తేదీన ప్రభుత్వం అర్హుల ఖాతాలో డబ్బులు జమ చేయడంతో అమ్మఒడి పథకానికి అర్హురాలైన మీరాజ్ బ్యాంకు ఖాతాలో కూడా డబ్బులు జమ అయ్యాయి. కానీ జమ అయిన డబ్బులను ఆ గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ ఆమెకు తెలియకుండా దోచేశాడు. 
 
మీరాజ్ కు మాయమాటలు చెప్పిన వాలంటీర్ అఫ్జల్ అమాయకురాలైన మీరాజ్ ను ఏటీఎం కార్డు వివరాలు నమోదు చేసుకోవాలని అందుకు ఏటీఎం కార్డు కావాలని కోరాడు. ఏటీఎం కార్డుతో పాటు ఏటీఎం పిన్ వివరాలను కూడా మహిళ నుండి వాలంటీర్ అఫ్జల్ తెలుసుకున్నాడు. ఆ తరువాత ఆమె బ్యాంకు ఖాతాలోని నగదును విత్ డ్రా చేసి తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం అఫ్జల్ ఆ డబ్బును ఉపయోగించుకున్నాడు. 
 
జమ అయిన అమ్మఒడి డబ్బులను విత్ డ్రా చేసుకుందామని ఏటీఎం సెంటర్ కు వెళ్లిన మీరాజ్ దంపతులకు ఖాతాలో నగదు లేనట్లు చూపించడంతో షాక్ కు గురయ్యారు. వెంటనే సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించగా బ్యాంకు అధికారులు అమ్మఒడి డబ్బులు ఏటీఎం కార్డు నుండి విత్ డ్రా అయినట్లు తెలిపారు. మోసపోయామని గ్రహించిన మీరాజ్ దంపతులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో గ్రామ వాలంటీర్ మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని గ్రామ వాలంటీర్ అఫ్జల్ కోసం గాలిస్తున్నారు. కొందరు ఇలాంటి పనులు చేస్తూ సీఎం జగన్ వాలంటీర్లపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: