కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఇది. మన పొరుగున ఉన్న చైనాలో ఈ వైరస్ బారిన పడి రోజూ పదుల సంఖ్యలో జనం చనిపోతున్నారు. ఇంకా దీని విస్తృతి పెరగొచ్చని భావిస్తున్నారు. మన పొరుగునే ఉన్న దేశం కాబట్టి ఇండియా కూడా వైరస్ గురించి భయపడుతోంది. ఇప్పుడు ఈ వైరస్ గురించి మరో వాస్తవం వెలుగు చూసింది.

 

ఇప్పటి వరకూ ఈ వైరస్ పాముల వల్ల వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అది వాస్తవం కాదట. ఈ వైరస్ పాముల మూలంగా వ్యాప్తి చెందినట్టు వస్తున్న వదంతుల్లో నిజం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. అందుకే వైరస్ కచ్చితమైన మూలాన్ని కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నారు. అంటే ఇప్పటికీ సరైన కారణం దొరకలేదన్న మాట. దాన్ని గుర్తించే లోగా ఎన్ని ప్రాణాలు గాల్లో కలుస్తాయో అన్న ఆందోళన కనిపిస్తోంది అంతటా.

 

కరోనా వైరస్ కారణంగా మృతుల సంఖ్య పెరగడంపై చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోందన్న జిన్ పింగ్ ఈ వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో గెలుస్తామని.. విశ్వాసం వ్యక్తం చేశారు. చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్ వేగంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. చైనాలో కరోనా వైరస్ ధాటికి మృతి చెందిన వారి సంఖ్య సెంచరీకి చేరుకుంటోంది. మరో 15 వందల మందికి ఈ వైరస్ సోకినట్లు చైనా ప్రకటించింది.

 

ఇందులో వందల మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు చైనా తెలిపింది. ఈ వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని 13 నగరాల్లో కఠిన ఆంక్షలు విధించింది. చైనా సహా ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తున్న కరోనావైరస్ ను ఎదుర్కోవడంపై ఇండియా కూడా దృష్టి సారించింది. ప్రధానమంత్రి కార్యాలయం సమీక్షలు నిర్వహిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 7 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో 115 విమానాలకు చెందిన 20 వేల ప్రయాణికులకు పరీక్షలు జరిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: