తెలంగాణలో జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై అధికార- ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల స‌మీక్ష‌లు, సంబురాలు కొన‌సాగుతున్నాయి. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ త‌గిలింది. టీఆర్ఎస్‌లోకి ఓ కార్పొరేట‌ర్ జంప్ అయ్యారు. విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రా రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  బడంగ‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 31 వార్డు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ చిరుగింత పారిజాత నరసింహారెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్రి హనుమంత్ రెడ్డి, కళ్లెం నరసింహారెడ్డి, కటికిరెడ్డి శ్రీ రామ్ రెడ్డి, తదితరులు టీఆర్ఎస్‌లో చేరారు. అయితే, ఈ జంపింగ్‌ల గురించి తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి ముందే వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

 

ఇదిలాఉండ‌గా, మున్సిప‌ల్ రిజ‌ల్ట్స్‌, టీఆర్ఎస్ పార్టీ విజ‌యంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి భ‌గ్గుమ‌న్నారు. రాజకీయాల్లో ప్రతిపక్షం అనేది లేకుండా చేసి, నియంతృత్వ పోకడలకు నిలువెత్తు నిదర్శనంగా తెలంగాణ సీఎం కేసీఆర్ నిలిచార‌న్నారు. `కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో, ప్రత్యర్థి పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులను ప్రలోభపెట్టే పనిలో టీఆర్ఎస్ అధిష్టానం బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిధులను లోబర్చుకోవడం కేసీఆర్ అండ్ కోకు కొత్తేమి కాదు. కాంగ్రెస్, టిడిపిలకు చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, వారికి మంత్రి పదవులు ఇచ్చి, రాజ్యాంగాన్ని మంట కలిపిన ఘనత కూడా కేసీఆర్‌ గారికి దక్కుతుంది. అక్కడి నుంచి మొదలైన ఈ ప్రహసనం... జడ్పీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ తరపున గెలిచిన అభ్యర్థులను కొనడంతో పాటు, చివరకు మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికైన ప్రతిపక్షానికి చెందిన ప్రతినిధుల వరకూ లొంగదీసుకొనే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.`` అని ఆరోపించారు.

 

తెలంగాణ ఓటర్ల ఆలోచన విధానాన్ని సీఎం దొరగారు కలుషితం చేశారని విజ‌య‌శాంతి ఆరోపించారు. ``ఎలాగో ప్రతిపక్షాలకు ఓటు వేసి గెలిపించినా... ఫలితాలు వచ్చిన తర్వాత వారు కూడా ఏదో ప్రలోభాలకు లొంగి, టీఆర్ఎస్‌లో చేరుతున్నారన్న సంకేతం ప్రజల్లోకి వెళ్లింది. దీంతో ఇతర పార్టీలకు ఓటు వేయడం కంటే టీఆర్ఎస్‌కు ఓటు వేయాలన్న ఆలోచన వాళ్లలో కలిగే విధంగా టీఆర్ఎస్ నాయకత్వం ఓ దుసాంప్రదాయానికి తెరలేపింది. ఇలాంటి ఎత్తులు, జిత్తులు చేయడంలో సీఎం దొరగారు దిట్ట అయ్యుండొచ్చు గాని... గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కెసిఆర్ ఇచ్చిన ఇచ్చిన హామీలలో ఎన్నిటిని అమలుచేశారనే ప్రశ్నకు మాత్రం ఆయన వద్ద సమాధానం దొరకదు. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారనే భయంతోనే ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ ఉంటారన్న విమర్శ కెసిఆర్ గారిపై ఉంది. తనకు తిరిగే లేదన్న అహంకారంతో దూసుకు వెళ్తున్న సీఎం కేసీఆర్ గారికి, గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం తర్వాత అయినా మార్పు వస్తుందని తెలంగాణ ప్రజానీకం ఆశించింది కానీ, నవ్విపోదురుగాక... అన్న చందంగా ఎవరేమనుకున్నా సీఎం దొరగారు తన వైఖరిని మార్చుకోవడం లేదు. కనీసం మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత అయినా కెసిఆర్ గారి మైండ్ సెట్ మారుతుందని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు. వారి ఆశలు ఎండమావులుగా మారకూడదని నేను కూడా కోరుకుంటున్నాను.`` అని విజయశాంతి సోష‌ల్ మీడియాలో మండిప‌డ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: