ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన మూడు రాష్ట్రాలకు సంబంధించిన బిల్లు శాసనసభలో ఆమోదం పొందినప్పటికీ శాసనమండలిలో మాత్రం వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లుకు చుక్కెదురైన  విషయం తెలిసిందే. శాసనమండలిలో అధికార వైసీపీ పార్టీకి తగిన మెజార్టీ లేకపోవడం.. ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ఎక్కువ మొత్తంలో మెజారిటీ కలిగి ఉండడంతో... ప్రతిపక్ష టీడీపీ సభ్యుల అభిప్రాయం ప్రకారమే వికేంద్రీకరణ సంబంధించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని శాసనమండలి చైర్మన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శాసన మండలి పై ఆగ్రహంతో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

 

 శాసనమండలిని రద్దు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో శాసన మండలి రద్దు కు సంబంధించి సోమవారం చర్చిద్దాం అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసలు శాసనమండలి అవసరమా అంటూ అసెంబ్లీ వేదికగా జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం  ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇకపోతే సోమవారం అసెంబ్లీ వేదికగా శాసనమండలి రద్దుకు  సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు చేస్తే వైసీపీ సర్కార్ కు రాజకీయంగా లబ్ధి చేకూరుతుందా  లేదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 

 

 ఒకవేళ అసెంబ్లీలో శాసనమండలి  రద్దు తీర్మానానికి ఆమోదం పొందినా...  పార్లమెంట్లో ఎప్పుడు  ఆమోదం పొందుతుంది అనేది మాత్రం స్పష్టత లేకుండా పోయింది. గతంలో శాసన మండలి రద్దు పునరుద్ధరణ కోసం రెండేళ్ల వరకు సమయం పట్టింది... ప్రస్తుతం కూడా పార్లమెంటులో శాసన మండలి తీర్మానం ఆమోదం పొందడానికి అంతే  సమయం పట్టునుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలా ఉంటే సంవత్సరం తర్వాత ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో త్వరలో వైసీపీకి మెజార్టీ పెరగనున్నదని... ఇలాంటి  సమయంలో శాసన మండలి రద్దు చేస్తే వైసీపీ కి పెద్ద  దెబ్బే  అంటున్నారు పలువురు. భవిష్యత్తులో జరిగే శాసన మండలి ఎన్నికలు వైసీపీ మెజారిటీ సాధించదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి సర్కారు శాసనమండలి రద్దు  వైపు మొగ్గు చూపుతుంది అంటూ మరోవైపు ప్రచారం కూడా జరుగుతోంది.మరి  శాసనమండలిని రద్దు నిర్ణయం పై జగన్ సర్కార్ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: