వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకవైపు శాసనమండలి రద్దుకు శరవేగంగా అడుగులు వేస్తుంటే , టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాత్రం మండలిని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం రద్దు చేసే అవకాశం లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు . పేద రాష్ట్రానికి ఖర్చు తో కూడుకున్న మండలి అవసరమా ? అంటూ అసెంబ్లీ వేదికగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెల్సిందే . ఇక పలువురు మంత్రులు , ఆ పార్టీ శాసనసభ్యులు మండలి రద్దుపై స్పష్టమైన  సంకేతాలను ఇస్తూనే ఉన్నారు .

 

అయినా బుద్ధా వెంకన్న మాత్రం బల్లగుద్ది మరి చెబుతా ... వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మండలిని రద్దు చేయదని పేర్కొనడమే కాకుండా , ఎందుకు రద్దు చేయదో కూడా కారణాలను వెల్లడించారు . ఎమ్మెల్సీలను బెదిరించడానికే ,  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మండలి రద్దు అంటోందని ఆరోపించారు .  మండలిలో స్థానాన్ని కల్పిస్తానని  ఎంతోమంది  ఆ పార్టీ నేతలకు  , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని పేర్కొన్నారు . మండలి రద్దు చేస్తే వారికి  ఎలా అవకాశం కల్పిస్తారని ప్రశ్నించారు . శాసనమండలి నుంచి ఎన్నికైన మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ , మోపిదేవి వెంకట రమణల చేత ముందు రాజీనామా చేయించి ,  దమ్ముంటే మండలిపై చర్చ పెట్టాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు .

 

మండలి రద్దు చేస్తే పదవులు పోతాయనే భయం తమకేమి లేదని స్పష్టం చేశారు . ఇక మండలిని పునరుద్దరించేటప్పుడు  తన తండ్రిని జగన్ ఎందుకు ప్రశ్నించలేదో  చెప్పాలని డిమాండ్ చేశారు . రాజధానుల పేరిట ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని , విశాఖ లో భూముల ఆక్రమణ కోసమే మూడు రాజధానుల నిర్ణయమని వెంకన్న అన్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: