ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలుగుదేశం పార్టీ కి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు గోడ  దూకేందుకు రెడీ గా ఉన్నారా ?, ఒక్క ఎమ్మెల్యేలే కాదు ... ఎమ్మెల్సీల పరిస్థితి కూడా అంతేనా ?? అంటే అవుననే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు . తాము డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను , ఎమ్మెల్సీలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదంటూనే , వారు మాత్రం  తమ పార్టీలో చేరేందుకు రెడీ గా ఉన్నారని చెబుతున్నారు .

 

టీడీపీ ఎమ్మెల్యేలను , ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుని తాము ఏమి చేసుకోవాలని ఎదురు ప్రశ్నిస్తున్నారు . టీడీపీ తరుపున గెల్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆ పార్టీ నాయకత్వం తో విభేదించి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరిన విషయం తెల్సిందే . అధికారికంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరకపోయినా , వారిక ఆ పార్టీ సభ్యుల కిందే లెక్క అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . ఇక మిగిలిన 21 మందిలో 17 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పరోక్షంగా చెప్పకనే చెప్పారు . వీరిలో రానున్న నాలుగేళ్ళ లో అధికార పార్టీ లో చేరేవారు ఎంతమంది అన్నదిప్పుడు హాట్ టాఫిక్ గా మారింది .

 

టీడీపీ ఎమ్మెల్సీ లు కూడా పలువురు ఇప్పటికే అధికార  పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారన్న వాదనలు లేకపోలేదు . ఆదివారం అమరావతి లో జరిగిన కీలక భేటీ కి ఏకంగా ఐదు మంది ఎమ్మెల్సీ లు డుమ్మా కొట్టడం అనుమానాలకు తావునిస్తోంది . అయితే వారు వేర్వేరు కారణాలు చెప్పి సమావేశానికి గైర్హాజరు అయినా , ఐదు మందిలో రానున్న నాలుగేళ్లలో పార్టీ లో కొనసాగేది ఎంతమంది అన్న అనుమానాలు లేకపోలేదు .  

మరింత సమాచారం తెలుసుకోండి: