తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధులు విందులు, వినోదాలు చేసుకుంటే, ఓడిపోయిన వారు మాత్రం వేదాలు వల్లిస్తున్నారు.తమ బాధను ఎలా ప్రజలకు చెప్పాలో తెలియకుండా, తమ పార్టీ నాయకుల దగ్గర పరువు పోకూడదని ఓటమిని కూడా ఎంత చక్కగా అంగీకరిస్తున్నారంటే, దీనికి కొన్ని కారణాలు కూడ వెల్లడిస్తున్నారు. అందులో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరు.

 

 

ఒకప్పుడు టీఆర్‌ఎస్‌ నాయకులను ఎరకిపారేసిన ఈ లీడర్ ఈ మధ్యకాలంలో కొంత సైలెంట్ అయ్యాడు. ఇక ఈ ఎలక్షన్స్ లో తాము ఓడిపోవడమే మంచిదైందనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైన ఓడిపోతే సవాలక్ష కారణాలు చూపడం కామనేగా.

 

 

ఇక జగ్గారెడ్డి చెప్పే కారణాలు అందరికి తెలిసినవే. అయినా తానేదో కొత్తగా కనుగొన్నట్లుగా వెల్లడిస్తున్నారు. అదేమంటే మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించడం పెద్ద గొప్ప విషయం కాదని, తాము ఓడిపోవడం చాలా మంచిదైందని, ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఒక వేళ గెలిచినా మున్సిపల్‌ చైర్మన్‌గా ఏ పనులు చేయకపోయేవాళ్లమని ఆయన అభిప్రాయపడ్డారు.

 

 

అధికారంలో ఉన్న పార్టీకి అన్ని బలాలు ఉన్నా.. కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇచ్చిందని, ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.. అంతే కాకుండా టీఆర్ఎస్ పార్టీ ఓటర్లను మభ్యపెట్టడమే కాకుండా కొన్ని చోట్ల భయపెడుతూ కూడా ప్రచారాన్ని నిర్వహించిందని,

 

 

ఇక ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం స్పష్టంగా కనిపించిందని, డబ్బులతో ఎన్నికలను గెలవచ్చనే కొత్త తరహా విధానాన్ని టీఆర్ఎస్ తీసుకొచ్చిందని జగ్గారెడ్డి విమర్శించారు.

 

 

అంతే కాకుండా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న సంగారెడ్డిలో కూడా టీఆర్ఎస్ జెండా ఎగరేసిందని, ఇందుకు కారణం మంత్రి హరీశ్ రావు కృషి వల్లే జరిగిందని, అందువల్ల ఆయనకు వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు జగ్గారెడ్ది పేర్కొన్నారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: