అసోం రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసోం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే కనీసం పదో తరగతి వరకు స్థానిక అస్సామీ భాష చదవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు అసోం రాష్ట్రంలోని అన్ని మాధ్యమాల పాఠశాలలకు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసోం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హిమనంత్ బిశ్వ శర్మ ఈ మేరకు ప్రకటన చేశారు. 
 
హిమనంత్ బిశ్వ శర్మ మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పదో తరగతి వరకు స్థానిక అస్సామీ భాష తప్పనిసరి చేసేలా టేబుల్ ఐటమ్ కింద బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. లోయ ప్రాంతంలో ఉన్నటువంటి బోడోల్యాండ్ టెర్రిటోరియల్ అటానమస్ జిల్లాలో అక్కడ స్థానిక భాషలైనటువంటి బోడో, బెంగాళీ భాషలను తప్పకుండా అభ్యసించాలని చెప్పారు. అలా అభ్యసించిన వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు అవుతారని పేర్కొన్నారు. 
 
హిమనంత్ బిశ్వ శర్మ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలలో చదువుతున్న విద్యార్థులు అసోం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కారని తన ఇద్దరు కొడుకులు ఇతర రాష్ట్రాలలో చదువుతున్నారని అందువలన వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కారని చెప్పారు. 3,000 కోట్ల రూపాయలను రాష్ట్రంలోని విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయటం కొరకు ఖర్చు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. 
 
23,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నామని ప్రాథమిక స్థాయిలో 15,000 ఉద్యోగాలను, సెకండరీ స్థాయిలో 8,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. 4 జతల యూనిఫాంలను ఒకటి నుండి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 2 జతల యూనిఫాంలను 9, 10 తరగతులు చదివే విద్యార్థులకు ఇవ్వనున్నట్టు మంత్రి హిమనంత్ బిశ్వ శర్మ తెలిపారు. మాతృభాష చదివిన వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించాలనే నిర్ణయం గురించి స్థానిక యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా అసోం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: