హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్, రాచకొండ పోలీసులు రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కొరకు బైక్ పై ఇద్దరు ప్రయాణిస్తే ఇద్దరికీ హెల్మెట్ ఉండాలనే నిబంధనను అమలులోకి తెచ్చారు. బైక్ పై ప్రయాణించే ఇద్దరిలో ఒకరికి హెల్మెట్ లేకపోయినా పోలీసులు బైక్ యజమానికి 100 రూపాయలు జరిమానా విధించనున్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మొదట వాహనదారులకు అవగాహన కల్పించి ఆ తరువాత పూర్తి స్థాయిలో నిబంధనల అమలు జరిగేలా కార్యాచరణ రూపొందించారు. 
 
రాచకొండ పోలీసులు కమిషనర్ మహేష్ భగవత్ తాజా ఆదేశాలతో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయడానికి సిద్ధమయ్యారు. మోటారు వాహనాల చట్టం నిబంధనల ప్రకారం బైక్ పై ప్రయాణించే ఇద్దరికీ హెల్మెట్ ఉండాల్సిందే. బైక్ పై ప్రయాణించే ఏ ఒక్కరికీ హెల్మెట్ లేకపోయినా జరిమానా విధించవచ్చు. కానీ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గతంలో ఈ నిబంధనను పెద్దగా పట్టించుకోలేదు. 
 
కానీ బైక్ పై వెనుక కూర్చున్న వారికి హెల్మెట్ లేకపోవడం వలన దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా వందల మంది మరణించినట్లు అధికారిక లెక్కల్లోనే వెల్లడవుతూ ఉండటంతో బైక్ పై ప్రయాణించే ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరి అనే నిబంధనను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొదట బైక్ పై ప్రయాణించేవారికి అవగాహన కల్పించాలని ఈ నిబంధనల గురించి విసృతంగా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
రాచకొండ పోలీసులు ఈ నెల 7వ తేదీ నుండి ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 328 మందికి పోలీసులు జరిమానా విధించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పోలీసులకు కూడా మినహాయింపు ఇవ్వొద్దని ఇప్పటికే స్పష్టం చేశారు. కీలక ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ కు ఇప్పటికే రాచకొండ ట్రాఫిక్ పోలీసులు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో బైక్ పై వెనుక కూర్చున్న 128 మంది మరణించినట్లుగా అధికారులు గుర్తించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: