తెలంగాణ‌లో అన్ని పార్టీల్లో ఉత్కంఠ‌ను రేకెత్తించిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల‌వ‌డ‌టం తెలిసిన సంగ‌తే. అయితే, ఇప్పుడు అంత‌కు మించిన ఉత్కంఠ కొన‌సాగుతోంది. అది ఎక్క‌డో కాదు....అధికార టీఆర్ఎస్ పార్టీలో. ఇప్పటికే 110కిపైగా మున్సిపాలిటీల్లో మెజార్టీ సాధించిన టీఆర్‌ఎస్‌..కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్ల ఎంపికపై తుదికసరత్తు చేసింది.  పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు నేత‌ల భ‌విష్య‌త్ డిసైడ్ చేశారు. 

 

మున్సిపల్‌ ఎన్నికల రాష్ట్ర సమన్వయకమిటీతో క్షేత్రస్థాయి పరిస్థితులపై తెలంగాణభవన్‌లో   పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు సమీక్షించారు. దీంతో పాటుగా శ‌నివారం సాయంత్రం నుంచి స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లామంత్రులతో స్వయంగా మాట్లాడారు. పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ, జిల్లా ఇంచార్జీలు సైతం ఈ ప్రక్రియలో పాలుపంచుకుటున్నారు. జిల్లా ఇంచార్జీలు మున్సిపాలిటీల వారీగా క్రోడీకరించిన జాబితాను పరిశీలించారు. ఈ జాబితా నుంచి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మేయర్లు, చైర్మన్‌ అభ్యర్థులను ఎంపిక చేశారు. పార్టీ నిర్ణయాన్ని స్థానిక నాయకత్వానికి తెలియజేశారు. పార్టీ సూచించిన అభ్యర్థులకే బీ ఫారాలు ఇవ్వాలని ఆదేశించారు.

 

కాగా, మేయర్లు, డిప్యూటీ మేయర్ల, చైర్‌పర్సన్లు, వైస్‌చైర్‌పర్సన్ల ఎంపిక కోసం కూడా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రత్యేక కసరత్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడి పార్టీకి కనీసం రెండుచొప్పున పేర్లను తెప్పించుకున్నారు. దీంతోపాటుగా ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎక్స్‌అఫీషియో సభ్యులను స్థానికంగా ఏ పురపాలక సంఘాలను ఎంచుకోవాలో పార్టీ సూచించింది. ఇతర పార్టీలతో సమానంగా బలం ఉన్నచోట, ఒకటి రెండు ఓట్లు అవసరమైన చోట్ల ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్టీకి ఉన్న ఎక్స్‌అఫీషియో సభ్యుల బలంతో ఇలాంటి పురపాలకసంఘాల్లో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయంగా కనిపిస్తున్నది. మ‌రోవైపు, ఇప్పటికే 110కిపైగా మున్సిపాలిటీల్లో మెజార్టీ సాధించిన టీఆర్‌ఎస్‌.. అవకాశం ఉన్న పురపాలికలనూ దక్కించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: