జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో శాసనమండలిని రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇదే ప్రధాన అజెండాతో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అందరూ ఊహించినట్లుగానే నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే  మండలి రద్దు కాదు అనే చంద్రబాబునాయుడు, టిడిపి నేతలకున్న దింపుడు కళ్ళెం ఆశలు ఆవిరైపోయింది.

 

నిజానికి మండలిని రద్దు చేయాలన్న ఆలోచన జగన్ లో లేదనే చెప్పాలి. కాకపోతే శాసనమండలిలో మెజారిటి ఉంది కదా అని  చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ తో జగన్ కు మండిపోయింది. అసెంబ్లీ ఆమోదించిన ప్రతి బిల్లును మండలిలో టిడిపి కావాలనే అడ్డుకోవటమో లేకపోతే ఓడగొట్టటమో చేస్తోంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టటాన్ని ముందు వ్యతిరేకించినా తర్వాత అసెంబ్లీలో చంద్రబాబు మద్దతిచ్చారు. అదే శాసనమండలిలో మాత్రం ఇదే బిల్లును టిడిపి ఓడగొట్టింది. ఇక ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమీషన్లు వేయటాన్ని అసెంబ్లీ ఆమోదించింది. అసెంబ్లీలో మద్దతిచ్చిన టిడిపి మండలిలో ఓడగొట్టింది. అసెంబ్లీలో ఎందుకు మద్దతిస్తోందో ? మండలిలో ఎందుకు ఓడగొడుతోందో అర్ధం కావటం లేదు.

 

అంటే అసెంబ్లీలో ఎటూ మెజారిటి లేదు కాబట్టి మద్దతిస్తు మండలిలో ఉన్న మెజారిటి కారణంగా ఓడగొడుతోంది. తాజాగా పరిపాలనా వికేంద్రీకరణ ఏపి సమగ్రాభివృద్ధి చట్టం 2020, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును అసెంబ్లీ ఆమోదిస్తే మండలిలో టిడిపి అడ్డుకుంది.  పోని బిల్లును ఓడగొట్టిందా అంటే అదీలేదు. సంబంధం లేని సెలక్ట్ కమిటికి పంపుతున్నట్లు ఛైర్మన్ ను మ్యనేజ్ చేసి ప్రకటన చేయించింది. దాంతో జగన్ కు ఒళ్ళు మండిపోయింది. ఈ అనైతిక రాజకీయాల వల్లే చివరకు శాసనమండలి రద్దుకు నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. మొత్తానికి ఒక్క టిడిపికే కాకుండా బిజెపి, పిడిఎఫ్ తో పాటు ఇండిపెండెంట్లకు కూడా షాక్ కొట్టినట్లైంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: