ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అధ్య‌క్షత‌న స‌మావేశ‌మైన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలని నిర్ణయించింది. మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ జరపనున్నారు. ఇక అసెంబ్లీలో ఆమోదముద్ర పొందిన తర్వాత ఈ బిల్లును వెంటనే కేంద్రానికి పంపాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. అయితే, ఏపీ స‌ర్కారు తీరుపై ప్ర‌తిప‌క్ష టీడీపీ భ‌గ్గుమంది. తాము అసెంబ్లీని బాయ్‌కాట్ చేశామ‌ని పేర్కొంటూ....లేఖ విడుద‌ల చేసింది.


 
శాసనమండలి రద్దు, సెలెక్ట్ కమిటీ.. శాసనసభలో జరిగే పరిణామాలపై చ‌ర్చించేందుకు టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న ఉదయం 9.30గంటలకు టీడీపీ శాసనసభా పక్ష సమావేశం జ‌రిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైన ఈ సమావేశంలో చర్చించారు. భేటీ అనంతరం.. టీడీపీ కీలక నేతలతో చంద్రబాబు చ‌ర్చించారు. అనంత‌రం ఏపీ శాసనసభ నిర్వహణపై టిడిఎల్‌పి సభ్యులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బిఎసి)ని పక్కన పెట్టేసి అసెంబ్లిని నిర్వహిస్తున్నారని వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

 

దీంతోపాటుగా గవ‌ర్న‌ర్‌, స్పీక‌ర్‌కు లేఖ‌లు రాసి త‌మ నిర్ణ‌యం వెనుక కార‌ణాల‌ను వెల్ల‌డించారు. గవర్నర్, శాసన సభ స్పీకర్ కు లేఖ రాసిన టీడీపీ శాసన సభా పక్షం ఇందులో ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించింది. టీడీపీ శాసన సభా పక్షం లేఖలోని సారాంశం ఇది. `సభల నిర్వహణలో బీఏసీ అజెండాను ఉల్లంఘించారు. ఇప్పటికే ఆమోదించిన బిల్లులపై చర్చ పెట్టి చెడు సాంప్రదాయాలకు నాంది పలికారు. 
3 రోజులు మాత్రమే అసెంబ్లీ అని బీఏసీ లో నిర్ణయించారు. బీఏసీకి చెప్పకుండానే మూడు రోజుల పాటు ఇష్టానుసారం సభను పొడిగించారు. మండలి సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులను అసెంబ్లీ లో చర్చించడం రూల్స్  విరుద్ధం. కౌన్సిల్ లో మాట్లాడిన అంశాలను శాసన సభలో ప్రస్తావించకూడదు. రాజ్యాంగ విరుద్ధంగా జరిగే చర్చల్లో పాల్గొనకూడదనే సభను బాయ్‌కాట్ చేశాం`` అని ఆ లేఖ‌లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: