మున్సిపల్  చైర్మన్ల ఎన్నిక సందర్బంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి . అధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ చౌటుప్పల్  కౌన్సిల్ హాల్ లో పేపర్లు చించి నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . భువనగిరి యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్, యాదగిరి గుట్ట మున్సిపల్ చైర్మన్ల  ఎన్నిక సందర్బంగా అధికార టీఆరెస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది . చౌటుప్పల్ , యాదగిరి గుట్ట  మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని గెల్చుకునేందుకు  అధికార పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోయినా , సిపిఎం మద్దతు తో టీఆరెస్ చైర్మన్ల  స్థానాన్ని కైవసం చేసుకుంది .

 

అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ , సిపిఎం లు కలిసి పోటీ చేశాయి . చైర్మన్ ఎన్నిక సందర్బంగా తమ పార్టీ బలపర్చిన అభ్యర్థి కి మద్దతునివ్వకుండా , టీఆరెస్ కు సిపిఎం కౌన్సిలర్లు మద్దతునివడాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా నిరసిస్తూ రోడ్డు పై బైఠాయించి ఆందోళనకు దిగారు  .  చౌటుప్పల్ మున్సిపల్  కౌన్సిల్ హాల్ లోకి వెళ్లకుండా సిపిఎం కౌన్సిలర్లను  కాంగ్రెస్ కార్యకర్తలు , నాయకులు  అడ్డుకునేందుకు ప్రయత్నించారు . ఈ క్రమం లో టీఆరెస్ , కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడికి తెగబడ్డారు .

 

దీనితో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు . కౌన్సిల్ లో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసిన వెంటనే సిపిఎం కౌన్సిలర్లు తమ పార్టీ కార్యాలయానికి చేరుకోగా , అప్పటికే ఆగ్రహం తో రగిలిపోతున్న,   కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ కార్యాలయం పై దాడికి  చేసి అద్దాలు ధ్వంసం చేయడమే కాకుండా , ఫర్నీచర్ ధ్వంసం చేశారు  . అధికార పార్టీ అక్రమంగా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడాన్ని నిరసిస్తూ  చౌటుప్పల్  కాంగ్రెస్ కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించడం తో పట్టణం లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: