దేశంలోని రాష్ట్రాల శాసన వ్యవస్థలోని సభలలో ఎగువ సభను శాసన మండలి అని అంటారు. దేశంలోని 7 రాష్ట్రాలలో మాత్రమే 2017 సంవత్సరం నాటికి శాసన మండలి ఉంది. ప్రజలచే పరోక్షంగా శాసన మండలి సభ్యులు ఎన్నికవుతారు. శాసన మండలిలోని సభ్యులను అసెంబ్లీ సభ్యులు, గవర్నర్, గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు, మొదలైనవారు ఎన్నుకుంటారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడొంతల సభకు ఎన్నికలు జరుగుతాయి. 
 
రాజ్యాంగ కర్తలు మేధావుల కొరకు శాసన మండలిని ఏర్పాటు చేశారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం శాసన మండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా ఉపయోగించుకుంటున్నారు. మొదట్లో చుక్కా రామయ్యలాంటి మేధావులు రాజశేఖర్ రెడ్డి హయాంలో గవర్నర్ కోటా కింద శాసన మండలికి నామినేట్ కాగా కొందరు కాంగ్రెస్, టీడీపీ సీనియర్లు మండలికి నామినేట్ అయ్యారు. 
 
కానీ ఆ తరువాత కాలంలో శాసన మండలిలో మేధావులకు స్థానం లభించకపోగా ఎన్నికల్లో గెలిచినా మంత్రి పదవులు కావాల్సిన వారికి, ఎన్నికల్లో టికెట్లు లభించని వాళ్లకు శాసన మండలి కలిసివచ్చింది. సాధారణంగా శాసన మండలిలో ఆరో వంతు గవర్నర్ చే సామాజిక సేవ, శాస్త్రము, కళలు, ఇతర రంగాలచే రాణించిన వారిని నియమించాలి. కానీ కొన్ని రాజకీయ పార్టీలు తమ పలుకుబడిని ఉపయోగించి గవర్నర్ చే కూడా పార్టీ సభ్యులనే నియమిస్తూ ఉండటం గమనార్హం. 
 
మేధావులు శాసన మండలికి ఎంపికై ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలి. కానీ మేధావుల బదులు రాజకీయ నాయకులే మండలిలో చేరి తమ పార్టీ అధికారంలో ఉంటే ఒకలా మరో పార్టీ అధికారంలో ఉంటే మరో విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేసే బిల్లులను శాసన మండలికి పంపుతున్నా ఆ బిల్లులు ఆమోదం పొందకుండా కొందరు కుటిల రాజకీయాలు చేస్తున్నారు. మేధావుల మాటున కొందరు చేస్తున్న రాజకీయాలే నేడు శాసన మండలి రద్దుకు ప్రభుత్వం తీర్మానం చేయటానికి కారణమైంది. 
 
ఎన్టీయార్ హయాంలో రద్దయిన శాసన మండలి 2007 ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునఃస్థాపించబడింది. 2007లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ తాము అధికారంలోకి వస్తే మండలిని రద్దు చేస్తామంటూ ప్రకటన చేసింది. గతంలో మండలి అవసరం లేదని చెప్పిన చంద్రబాబు నేడు అదే మండలి అవసరం అని చెబుతూ ఉండటం గమనార్హం. మేధావుల మాటున ఏపీలో కొందరు రాజకీయ నేతలు చేస్తున్న రాజకీయాలకు నేటి మండలి రద్దు తీర్మానంతో తెరపడే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: