పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి.ప్రాంతాల‌కు అతీతంగా ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తున్నారు. అయితే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఊహించ‌ని విధంగా నిర‌స‌న‌లు ఎదుర‌య్యాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా షా ప్ర‌సంగించ‌డం, ఓ వ్య‌క్తి బ‌హిరంగంగా నిర‌స‌న తెల‌ప‌డం....ఆయ‌న‌పై బీజేపీ కార్య‌క‌ర్త‌ల దాడి...ఇలా ప‌రిణామాలు జ‌రిగిపోయాయి.

 


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నిన్న సాయంత్రం బాబర్‌పూర్‌ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రసంగిస్తున్న సమయంలో  ఓ యువకుడు నిలబడి సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు ఆ యువకుడిని తీవ్రంగా చితకబాదారు. ఈ ఘటనను గమనించిన అమిత్‌ షా జోక్యం చేసుకొని.. యువకుడిని కొట్టొద్దని కార్యకర్తలకు సూచించాడు. యువకుడిని ఆ గుంపు నుంచి బయటకు తీసుకురావాలని తన సెక్యూరిటీ సిబ్బందికి అమిత్‌ షా సూచించారు. అనంతరం భారత్‌ మాతా కీ జై అంటూ అమిత్‌ షా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇక యువకుడిని పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. యువకుడు చెప్పిన ఇంటి అడ్రస్‌ ఆధారంగా అతడిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. 

 

కాగా, జేఎన్‌యూ మాజీ విద్యార్థి, ఢిల్లీలోని షాహీన్‌ బాగ్‌ వద్ద కొనసాగుతున్న సీఏఏ వ్యతిరేక నిరసనల నిర్వాహకుల్లో ఒకరైన షార్జీల్‌ ఇమామ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. ఆయ‌న చేసిన వివాదాస్ప‌ద కామెంట్ల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. శనివారం షార్జీల్  మాట్లాడుతూ.. ‘బెంగాలీయులైన హిందువులను, ముస్లింలను చంపుతున్నారు. కొందరిని నిర్బంధ కేంద్రాలకు తరలిస్తున్నారు. భారత్‌ నుంచి అసోం విడిపోవాలి. ఇది ఒక గుణపాఠం కావాలి. నేను ఐదు లక్షల మందిని సమీకరించగలిగితే భారత్‌ నుంచి అసోంను శాశ్వతంగా లేదా కొన్ని నెలలపాటు విడదీసేందుకు అవకాశముంటుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. స్పందించిన ఢిల్లీ, అసోం పోలీసులు షార్జీల్‌ ఇమామ్‌పై దేశద్రోహంతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: