ఏపీ అసెంబ్లీ ఈరోజు శాసన మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం సీఎం జగన్ శాసన మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టగా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తీర్మానం గురించి తమ స్పందన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ శాసన మండలి రద్దు తీర్మానం గురించి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎందుకు శాసనమండలిని రద్దు చేయాలనుకుంటుందో చెప్పారు. 
 
ఏపీ శాసన మండలి రద్దు తీర్మానంపై ఆ తరువాత ఓటింగ్ జరిగింది. స్పీకర్ తమ్మినేని సీతారాం శాసన మండలి రద్దు కోసం చేసిన తీర్మానానికి అనుకూలంగా ఉన్న సభ్యులు లేచి నిలబడాలని కోరగా ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు. ఆ తరువాత లేచి నిలబడిన సభ్యులను లెక్కించారు. స్పీకర్ శాసన మండలి రద్దు తీర్మానానికి వ్యతిరేకంగా ఉన్న సభ్యులు నిలబడాలని కోరగా ఎవరూ లేచి నిలబడలేదు. 
 
స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీలో సభ్యులు కాని మంత్రి మోపిదేవి వెంకట రమనను, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సభలో సభ్యులు కానందువలన వేరే చోట కూర్చోవాలని కోరారు. అసెంబ్లీ శాసన మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన ఎమ్మెల్యేలను లెక్కపెట్టగా 133 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేసినట్టు తేలింది. 133 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓట్లు వేయడంతో తీర్మానం ఆమోదం పొందింది. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు హాజరు కాకపోవటంతో అసెంబ్లీలో కొంత టెన్షన్ నెలకొంది. 
 
వైసీపీ పార్టీకి మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 151 మంది ఎమ్మెల్యేలో కేవలం 133 మంది మాత్రమే తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు ఈరోజు సమావేశాలకు హాజరయ్యారా...? లేదా...? హాజరైతే ఓటింగ్ జరిగే సమయంలో ఎందుకు లేరు..? ఓటింగ్ కు హాజరు కాని ఎమ్మెల్యేల విషయంలో వైసీపీ పార్టీ చర్యలు తీసుకోనుందా...? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఆమోదం పొందిన శాసన మండలి రద్దు తీర్మానాన్ని పంపనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: