ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలోని ప్ర‌భుత్వం శాస‌న‌మండ‌లిని ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మే కాకుండా ఈ మేర‌కు అసెంబ్లీలో బిల్లు ఆమోదింప చేసుకున్న సంగ‌తి తెలిసిందే. స‌భ‌కు హాజ‌రైన ఎమ్మెల్యేలంతా ఈ మేర‌కు ఓటు వేశారు. జనసేనాని పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సైతం ఈ తీర్మానానికి మ‌ద్ద‌తు ప‌లికారు. అయితే, ఈ ప‌రిణామంపై జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. మండలి రద్దు సవ్యమైన చర్య కాదని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు.

 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పునరుద్ధరించిన శాసన మండలిని ఇప్పుడు రద్దు చేయడం సవ్యమైన చర్య కాదని జనసేన భావిస్తోందని ఈ మేర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ``రాజ్యాంగ రూపకర్తలు ఎంతో ముందు చూపుతో రాష్ట్రాలలో రెండు సభల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ఏదైనా ఒక బిల్లుపై శాసనసభలో పొరపాటు నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపై పెద్దల సభలో మేథోపరమైన మధనం చేసి అటువంటి బిల్లులను సరిదిద్దడానికి శాసన మండలిని రూపకల్పన చేశారు. ఇంతటి ఉన్నత ఆశయంతో ఏర్పాటైన మండలిని మన రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రద్దు చేయడం సబబు కాదని జనసేన భావిస్తోంది.`` అని ప‌వ‌న్ పేర్కొన్నారు.

 

ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థలను తొలగించుకుంటూ పోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధ‌మ‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. ``శాసన మండలి రద్దుకు ప్రజల ఆమోదం ఉందా..? లేదా అనే అంశాన్ని ఎక్కడా పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు శాసన మండలిలో నిలిచిపోయిన నేపథ్యంలో శాసనమండలి రద్దు చేయడం సహేతుకంగా అనిపించడం లేదు. మండలి రద్దుతో మేధావుల ఆలోచనలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించే అవకాశాన్ని మనం కోల్పోయినట్లుగా జనసేన భావిస్తోంది.  శాసనమండలిని రద్దు చేసే ప్రత్యేక పరిస్థితులేవీ రాష్ట్రంలో నెలకొనలేదని జనసేన అభిప్రాయపడుతోంది.`` అని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: