ఏపీ అసెంబ్లీలో శాసన మండలిని రద్దు కోరుతూ సీఎం జగన్ తీర్మానాన్ని సోమవారం ఉదయం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సమర్థిస్తూ సుదీర్ఘంగా జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా తీర్మానాన్ని బలపరచాల్సిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా జగన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై సభలో ఓటింగ్ నిర్వహించారు..ఈ సందర్భంగా అందరి దృష్టి ఇద్దరు ఎమ్మెల్యేలపైన పడింది. ఈ ఇద్దరు జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఓటు వేస్తారా లేదా అనే విషయంపై అందరూ ఆసక్తిగా గమనించారు. అసెంబ్లీలో శాసన మండలి రద్దు సమయంలో పార్టీకి దూరంగా ఉంటున్న ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.


 టిడిపి నుంచి ఇటీవల సస్పెన్షన్ కు గురైన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ అసెంబ్లీలోనే ఉండగా, మరో టిడిపి ఎమ్మెల్యే మద్దాల గిరి మాత్రం ఓటింగ్ కు గైర్హాజరయ్యారు. ఇటీవలే ఆయన వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా తాను వైసిపిలో చేరుతున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఇప్పటికే ఈ ఇద్దరు పార్టీ నిర్ణయం ప్రకారం ఓటింగ్ లో పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ విప్ జారీచేసింది. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరంగా ఉండి టిడిపి కి ఝలక్ ఇచ్చారు. దీని ద్వారా తాము పార్టీకి మాకు సంబంధం లేదు అనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. 


 ఇక జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి మరీ జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు పలుకుతూ వైసిపి కి అనుకూలంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నిర్ణయం ప్రకారం మీరు నడుచుకోవాలి అంటూ రాపాక వరప్రసాద్ కు బహిరంగ లేఖ రాశారు. అయినా పవన్ నిర్ణయాన్ని కాదని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా జగన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమర్పిస్తూ ఓటింగ్ లో పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: