జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ కళ్యాణ్ మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంగళగిరిలోని జనసేన  పార్టీ కార్యాలయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని సమస్యలతోపాటు రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న పరిస్థితులపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, తాను పెట్టిన పార్టీ కుల, మతాలకు అతీతంగా సకల జనులను రక్షించేది కావాలి అన్న ఉద్దేశంతో జనసేన అని పేరు పెట్టాన‌ని ఈ సంద‌ర్భంగా వివ‌రించారు.

 


ఈ సంద‌ర్భంగా అధికార వైసీపీ, సీఏఏ గురించి ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``మండలి చైర్మ‌న్ ష‌రీప్‌పై జరిగిన దూషణల గురించి పత్రికల్లో చదివాం. ఆయన పెద్ద తరహాలో వాటిపై ఏమీ మాట్లాడలేదు. జగన్ రెడ్డి మాటల్లో తేనె రాసుకుని చేతల్లో కత్తులతో పొడిచేస్తారు. అలాంటి వారిని నమ్మకండి. వైసీపీ సీఏఏకి ఓటేస్తుంది... ఇక్కడికొచ్చి వ్యతిరేకం అంటుంది. నేను ఉన్నదేదో మాట్లాడేస్తాను. వైసీపీ వాళ్లు సెక్యులరిజం అంటారు. కడపలో ముస్లిం సోదరుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. అంతా కలసికట్టుగా ఉంటే అపోహలు రావు. మేము నెల్లూరులో ఉండగా రొట్టెల పండుగ చేసుకునే వాళ్లం. అక్కడ అసలు మతం అనేది ఎక్కడ ఉంటుంది. కొత్త తరంలో అయినా మార్పు రావాలి.` అని ప‌వ‌న్ పేర్కొన్నారు.

 

భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు సమస్యలు వస్తే అవి పార్టీ పరిధిలో మాట్లాడుకుందామ‌ని ప‌వ‌న్ అన్నారు. `` బీజేపీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన నేను మతోన్మాదిని అయిపోను. అది నిజంగా మతోన్మాదులు ఉన్న పార్టీ అయితే దేశంలో ఇంత భద్రత ఉండదు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు సెక్యులర్ పార్టీలే. వారి స్టాండ్ మాత్రమే వేరు ఉంటుంది. బీజేపీ సెక్యులర్ పార్టీ కాదు అంటే వైసీపీ ఎలా అవుతుంది? వైసీపీ వాళ్లు చేసేది ఒకటి చెప్పేది ఒకటి ఉంటుంది.`` అని ప‌వ‌న్ అన్నారు. త‌న దృష్టిలో రాజకీయం అంటే దేశ సేవ అని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. ``ఓట్ల కోసం తిట్లు తినాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏదైనా నిలబడగలిగితేనే మాట్లాడుతా. సామాన్యుల కోసం నేను జనసేన పార్టీ స్థాపించా. సామాన్యుడు బయటికి వచ్చి మాట్లాడాలి అన్న ఉద్దేశంతో పెట్టాం. ఆ నమ్మకం నిజం అవుతున్నందుకు సంతోషంగా ఉంది.`` అని ప‌వ‌న్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: