ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ బెనర్జీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భారత సంతతి అమెరికన్‌ ఆర్థికవేత్త అయిన అభిజిత్ రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఆదివారం జరిగిన జైపూర్‌ సాహిత్య వేడుకలో పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, తాను భారత్‌లోనే ఉండి ఉంటే నోబెల్‌ను గెలిచేవాడిని కాదని అభిజిత్‌ బెనర్జీ తెలిపారు. కేవలం ఒక్క వ్యక్తి వల్లే ఇది సాధ్యపడదని, చాలా మంది కృషి ఫలితంగా తనకు ఆ గౌరవం దక్కిందని ఆయన చెప్పారు.

 

 నిరంకుశత్వం, ఆర్థిక విజయం మధ్య ఎలాంటి సంబంధం లేదని అభిజిత్ అన్నారు. సింగపూర్‌లో విజయవంతమైన నియంతృత్వాన్ని జింబాబ్వేతో పోల్చలేమన్నారు. కొంతస్థాయిలో అధికారం అన్నది భ్రాంతి అని చెప్పారు. దేశ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. భారత్‌లో బలమైన ప్రతిపక్షం అవసరమని, ప్రజాస్వామ్యానికి అది ఆత్మ వంటిదని విశ్లేషించారు. భారత్‌కు సరైన ప్రతిపక్షం అవసరమ‌ని పేర్కొన్న అభిజిత్ ఎందుకు అవ‌స‌ర‌మో విశ్లేషించారు. ``ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిది. అధికార పార్టీపై పర్యవేక్షణకు బలమైన ప్రతిపక్షం అవసరం’ అని బెనర్జీ చెప్పారు. 

 

బంగ్లాదేశ్‌లో పదేళ్ల‌ పాటు చేసిన  ప్రయోగాన్ని పేర్కొంటూ...అలాంటిది భారత్‌లోనూ ఫలితాలను ఇస్తుంద‌ని అభిజిత్ చెప్పారు. పేదరికం అనేది క్యాన్సర్‌ వంటిదని, పలు సమస్యలకు అదే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘కొందరు విద్యలో పేదలు, కొందరు ఆరోగ్యపరంగా పేదలు, కొందరు ఆర్థికంగా పేదలు. ఈ సమస్యలన్నింటిని ఒక్క చర్యతో పరిష్కరించాలనుకోవడం సాధ్యమయ్యే పనికాదు. లోపం ఎక్కడ ఉన్నదో గ్రహించి దానిపై పోరాడాలి’ అని చెప్పారు. ``పేదలపై సమాజంలో ఒక అభిప్రాయం బలంగా ఉంది. వారికి డబ్బులిస్తే వృథాగా ఖర్చుపెట్టి సోమరులుగా మారి పేదలుగానే ఉంటారని భావిస్తారు. కానీ అది తప్పు. పేదల శక్తి సామర్థ్యాలపై చాలా వివక్ష ఉంది. నిరుపేదలకు ఆవులు, మేకలు లేదా అమ్ముకునే వస్తువులను ఉచితంగా ఇవ్వాలి. అప్పుడు వారు కష్టపడేందుకు అవకాశముంటుంది. పదేళ్ల‌ తర్వాత వారిలో 25 శాతం మంది ధనికులుగాను, సంతోషంగాను, ఆరోగ్యంగాను ఉంటారు’ అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: