2014 ఎన్నికలకు రెండు నెలల ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చింది. 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీ పార్టీల మద్దతుతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోలేదు. వామపక్షాలతో, బీఎస్పీతో పొత్తు పెట్టుకొని జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది. 
 
2019 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నుండి, వైసీపీ పార్టీ, బీజేపీ నుండి కొందరు నేతలు జనసేనలో చేరారు. జనసేన పార్టీ కనీసం 5 నుండి 10 ఎమ్మెల్యే స్థానాలైనా గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ అంచనాలకు భిన్నంగా జనసేన పార్టీ నుండి కేవలం ఒక అభ్యర్థి మాత్రమే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండు స్థానాల నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లో ఓటమిపాలయ్యారు. 
 
2019 ఎన్నికల ఫలితాల తరువాత ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ పరోక్షంగా ఎప్పుడూ మద్దతు ప్రకటిస్తూ ఉండటంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరూ జనసేనలో చేరటానికి ఆసక్తి చూపించలేదు. వైసీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ నుండి నాయకులెవరూ జనసేనలో చేరే అవకాశమే లేకుండా పోయింది. 
 
ఇటీవలే జనసేన పార్టీ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవటంతో జనసేన పార్టీలోకి ఇతర పార్టీల నుండి చేరికలు మొదలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నుండి 10 మంది కార్యకర్తలు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మాకినీడి శేషుకుమారి ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. ఈ పది మంది కార్యకర్తల చేరిక వలన పెద్దగా ప్రయోజనం లేకపోయినా భవిష్యత్తులో మరిన్ని చేరికల ద్వారా జనసేన బలపడే అవకాశం ఉంది. జనసేన బీజేపీ పొత్తుతో రాష్ట్రంలో రోజురోజుకు బలహీనపడుతున్న తెలుగుదేశం పార్టీకి జనసేన బీజేపీ పార్టీలు ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉంది. పార్టీలో చేరికలు ఇలాగే కొనసాగితే కొన్ని సామాజిక వర్గాల మద్దతు కూడా జనసేన పార్టీకి లభించే అవకాశం ఉంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: