సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నా... పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే సామాజిక వర్గంగా క్షత్రియులు పేరు సంపాదించారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతంలో రాజుల రాజకీయం ఆసక్తికరంగా ఉంటుంది. రాజులంతా ఏకతాటిపైకి వచ్చి అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోని గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా లో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. డెల్టాలోని కీలక ప్రాంతాలైన నరసాపురం, ఆచంట అసెంబ్లీ స్థానాలతో పాటు నరసాపురం పార్లమెంటు స్థానంలో క్షత్రియ అభ్యర్థులే విజయం సాధించారు. 


ఎన్నికల వరకు అంతా సజావుగానే సాగుతున్నట్టు కనిపించినా ఆ తర్వాత ఒకరంటే ఒకరికి పొసగని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఆచంట నుంచి గెలిచి మంత్రి పదవి సంపాదించుకున్న చెరుకువాడ శ్రీరంగనాథరాజు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇక ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు బీజేపీ అగ్ర నాయకులతో సన్నిహితంగా ఉండడం వల్ల వైసిపిలో ఆయనకు ప్రాధాన్యం తగ్గింది. ప్రోటోకాల్ ప్రకారం ఆయనను పిలుస్తున్నా మిగతా ఏ విషయాలు ఆయనతో పంచుకునేందుకు పార్టీ నాయకులు ఇష్టపడడం లేదు. దీంతో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మంత్రి రంగనాథరాజు హాజరవుతున్నారు.


మొదటి నుంచి జగన్ కు వీర విధేయుడుగా ఉన్న తనకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం రంగనాథరాజు కారణమనే అసహనం ప్రసాద్ రాజులో కనిపిస్తోంది. దీనికి తగ్గట్టుగానే మంత్రి రంగనాథరాజు కూడా ఆధిపత్య రాజకీయాలకు తెరతీశారు. దీంతో ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. మంత్రి తమ పక్క నియోజకవర్గమైన పాలకొల్లు, నరసాపురం లో కూడా తన ఆధిపత్యాన్నిచూపించేందుకు ప్రయత్నిస్తుండడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది.


 అందుకే రంగనాథరాజు వ్యవహారశైలిపై జగన్ కు ఫిర్యాదు చేయాలని ప్రసాద్ రాజు వర్గం భావిస్తోంది. ఇప్పటికే రంగనాథరాజు వ్యవహారం జగన్ వద్దకు చేరిందని, దూకుడు తగ్గించుకోవాలని మంత్రికి  సూచించారని ప్రచారం జరుగుతోంది. అయినా ఆయనలో పెద్దగా మార్పు కనిపించకపోవడంతో మరోసారి రంగనాథరాజు వ్యవహారాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన వ్యతిరేక వర్గం పావులు కదుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: