సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లుపై గట్టి పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ బిల్లును అడ్డుకుందామని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు చివరకు మండలి రద్దుకే దారి తీశాయి. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ చేసిన మండలి రద్దు తీర్మానం కేంద్రం ముందుకు వెళ్తుంది. మరి అక్కడ ఎన్నాళ్లలో క్లియర్ అవుతుందో తెలియదు. అయితే ఇదే సమయంలో ఓ షాకింగ్ విషయం వెలుగు చూస్తోంది.

 

అసలు రాజధాని మార్పు కోసం చట్టమే అవసరం లేదని కొందరు న్యాయ నిపుణలు చెబుతున్నారు. కేవలం ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వేసేస్తే చాలట. ఈ విషయం తెలియక జగన్ ఇక్కడి వరకూ తెచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజధాని బిల్లులకు సంబంధించి చెప్పుకోవాల్సి వస్తే.. అసలు సీఆర్డీఏ బిల్లు అవసరం లేదట.. ఎందుకంటే..? అందులో సీఆర్డీఏ చట్టంలో అమరావతి అని ప్రత్యేకంగా మెన్షన్ చేసి లేదు కాబట్టి..

 

కర్నూలు, విశాఖల్లో ఫలానా ఫలానా ఆఫీసులు, విధులు అని చేర్చుకుంటే సరిపోయేదట… బిల్లు తీసుకురావాల్సినంత అవసరమే లేదట. ఇక రాజధాని విషయానికి వస్తే.. ఇప్పటికీ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం హైదరాబాదే ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధాని…కాబట్టి మూడు రాజధానులు అంటూ ప్రత్యేకంగా వేరే బిల్లు తీసుకురావల్సిన అవసరం కూడా లేదట. కేవలం ఆర్డర్లతో సరిపోయే విషయానికి జగన్ అనవసరంగా రెండు బిల్లులతో నెత్తిగోక్కున్నాడని పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు భావిస్తున్నారట.

 

ఇదే కాదు.. ఇంగ్లిషు మీడియం బిల్లు కూడా అంతేనట. ఎందుకంటే.. తెలంగాణలో కేసీయార్ ఎలాంటి బిల్లు తేకుండానే వేల స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం ప్రారంభించేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి వాటికి పాలనపరమైన ఉత్తర్వులు సరిపోతాయట.. ప్రతి దానికీ చట్టం అవసరం లేదట. మరి ఇలాంటి విషయాల్లో సలహాలు ఇవ్వకుండా.. జగన్ ను మార్గదర్శనం చేయకుండా తన చుట్టూ అంతమంది సలహాదారులు ఎందుకు ఉన్నట్టు అన్న వాదన వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: